Real Estate : బడ్జెట్ ఇళ్లు మాయం..కోటి రూపాయల ఇళ్లకే క్రేజ్..కొత్త పుంతలు తొక్కుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్
కొత్త పుంతలు తొక్కుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్

Real Estate : భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక వింతైన మార్పు కనిపిస్తోంది. సాధారణంగా సామాన్యులు కొనే బడ్జెట్ ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. తాజాగా ప్రోప్ ఈక్విటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రధాన టైర్-2 నగరాల్లో రూ.కోటి పైన ధర పలికే విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. మరోవైపు తక్కువ ధర ఉండే ఇళ్ల అమ్మకాలు మందగించడం విశేషం.
నివేదిక ప్రకారం.. 2025 ఏడాదిలో దేశంలోని 15 ప్రధాన టైర్-2 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 10 శాతం మేర తగ్గి 1,56,181 యూనిట్లకు పరిమితమయ్యాయి. అయితే విక్రయించిన ఇళ్ల సంఖ్య తగ్గినా, వాటి మొత్తం విలువ మాత్రం రూ.1.48 లక్షల కోట్లుగా స్థిరంగా ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం రూ.కోటి కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 9 శాతం పెరగడమే. 2024లో ఈ ప్రీమియం ఇళ్ల వాటా 23 శాతంగా ఉండగా, 2025 నాటికి అది 28 శాతానికి చేరుకుంది. అంటే జనం ఇప్పుడు చిన్న ఇళ్ల కంటే అన్ని వసతులు ఉన్న లగ్జరీ ఇళ్లకే మొగ్గు చూపుతున్నారు.
ప్రోప్ ఈక్విటీ సీఈఓ సమీర్ జసూజా అభిప్రాయం ప్రకారం.. భూముల ధరలు, నిర్మాణ సామాగ్రి ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల బిల్డర్లు తక్కువ ధరలో ప్రాజెక్టులను చేపట్టలేకపోతున్నారు. ఫలితంగా రూ.కోటి లోపు ఇళ్ల సరఫరా మార్కెట్‌లో తగ్గిపోయింది. మరోవైపు టైర్-2 నగరాల్లో ఐటీ కంపెనీల రాక, మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ పెరగడంతో ధనవంతులు, ఇన్వెస్టర్లు ప్రీమియం ఇళ్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు టైర్-2 నగరాలు కూడా మెట్రో నగరాల తరహాలోనే తక్కువ అమ్మకాలు-ఎక్కువ ధరల ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి.
ఈ నివేదికలో నగరాల వారీగా గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇళ్ల అమ్మకాలు అత్యధికంగా 38 శాతం పడిపోయాయి. అహ్మదాబాద్, సూరత్, వడోదర, నాసిక్, జైపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, కోయంబత్తూరు, గోవా వంటి నగరాల్లో కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే దీనికి భిన్నంగా మొహాలీలో 34 శాతం, లక్నోలో 6 శాతం అమ్మకాలు పెరగడం విశేషం. ఈ నగరాల్లో కొత్త ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు పెరగడం రియల్ ఎస్టేట్ వృద్ధికి దోహదపడింది.
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఇళ్లు దొరకడం గగనంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా లాభాల వేటలో భాగంగా ప్రీమియం, లైఫ్ స్టైల్ ఆధారిత ఇళ్లపైనే దృష్టి పెడుతున్నాయి. ఫలితంగా కోటి రూపాయల బడ్జెట్ అనేది ఇప్పుడు విలాసం కాదు, కనీస అవసరంగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో టైర్-2 నగరాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

