Loan Waiver : రైతన్నలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
రూ.2 లక్షల రుణమాఫీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Loan Waiver : మహారాష్ట్రలోని లక్షలాది మంది రైతు కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సాగు రుణమాఫీ పథకానికి ఎట్టకేలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం.. అర్హులైన ప్రతి రైతుకు రూ. 2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయనుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి.
ఎన్నికల కోడ్ ముగిశాకే అధికారిక ప్రకటన
మంత్రివర్గ సమావేశంలో ఈ రుణమాఫీ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ, ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తిగా ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ సమయంలోనే రుణమాఫీకి సంబంధించిన పూర్తి నియమ నిబంధనలు, అర్హతల వివరాలతో కూడిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేయనున్నారు.
56 లక్షల మంది రైతులకు ప్రయోజనం
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని దాదాపు 56 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో ఉన్న రూ. 2 లక్షల వరకు బకాయి ఉన్న పంట రుణాలను ప్రభుత్వం భరించనుంది. దీనివల్ల రైతులపై ఉన్న అప్పుల భారం తగ్గి, వారు ఎలాంటి టెన్షన్ లేకుండా కొత్త సీజన్ పంట పెట్టుబడుల కోసం సన్నద్ధం కావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
సకాలంలో అప్పు తీర్చిన వారికి రూ.50,000 బోనస్
ఈ పథకంలో ప్రభుత్వం కేవలం అప్పులు ఉన్నవారిని మాత్రమే కాకుండా, బ్యాంకులకు క్రమంతప్పకుండా లోన్లు కడుతున్న నిజాయితీ గల రైతులను కూడా ఆదుకోవాలని నిర్ణయించింది. బ్యాంకులకు సమయానికి రుణాలను తిరిగి చెల్లించిన రైతులకు ప్రోత్సాహకంగా రూ. 50,000 వరకు నగదు బహుమతిని ఇవ్వాలని క్యాబినెట్ ప్రతిపాదించింది. దీనివల్ల రెగ్యులర్‌గా లోన్లు కట్టే రైతులకు కూడా పెద్ద ఎత్తున న్యాయం జరుగుతుంది.
రుణమాఫీ పథకం ముఖ్య నిబంధనలు ఇవే
ఈ పథకం కింద 30 సెప్టెంబర్ 2025 నాటికి బ్యాంకుల్లో బకాయి ఉన్న పంట రుణాలు మాత్రమే మాఫీ పరిధిలోకి వస్తాయి.
* అర్హత కలిగిన రైతులకు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు రుణ విముక్తి కల్పిస్తారు.
* క్రమం తప్పకుండా లోన్లు కట్టే రైతులకు రూ. 50,000 వరకు ప్రోత్సాహక గ్రాంట్ అందుతుంది.
* ఈ భారీ రుణమాఫీ పథకం అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ. 25,000 కోట్ల అదనపు భారం పడనుంది.
తీరిన సుదీర్ఘ నిరీక్షణ.. రైతన్నల్లో హర్షాతిరేకాలు
గత ఏడాది కురిసిన అకాల వడగండ్ల వానలు, ప్రతికూల వాతావరణం వల్ల మహారాష్ట్రలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి రుణమాఫీ చేయాలంటూ పలు రైతు సంఘాలు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో 30 జూన్ 2026 లోపు రైతులకు మంచి ఉపశమనం కలిగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం క్యాబినెట్ ఆమోదం తెలపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

