ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

Mahindra XUV 3XO EV : మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరో సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ సబ్-కాంపాక్ట్ SUV XUV 3XOని ఎలక్ట్రిక్ అవతార్‌లో అధికారికంగా విడుదల చేసింది. కేవలం రూ.13.89 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) వచ్చిన ఈ కారు, మధ్యతరగతి, సిటీలో తిరిగే వాహనదారులకు ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలవనుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్‌కు గట్టి పోటీ ఇచ్చేలా మహీంద్రా ఈ కారును డిజైన్ చేసింది.

ఈ కారు ముఖ్యంగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అవి AX5, AX7L. ఫిబ్రవరి 23, 2026 నుండి ఈ వాహనాల డెలివరీ ప్రారంభం కానుంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా పెట్రోల్, డీజిల్ మోడల్స్ వాడిన ప్లాట్‌ఫారమ్ మీదనే తయారు చేయడం విశేషం.

ఈ XUV 3XO EV లో 39.4 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోడ్ల మీద సుమారు 285 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక వేగం విషయానికి వస్తే, ఈ కారు కేవలం 8.3 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని మోటార్ 110 kW పవర్, 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఛార్జింగ్ సమస్య లేకుండా ఉండటానికి, 50 kW DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీని నింపుకోవచ్చు.

ఫీచర్ల విషయంలో మహీంద్రా ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా AX7L టాప్ వేరియంట్‌లో లెవల్-2 ADAS టెక్నాలజీని అందించారు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో రెండు 10.25-అంగుళాల భారీ స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ప్రీమియం హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ ప్రయాణాన్ని మరింత విలాసవంతంగా మారుస్తాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరాను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు.

మహీంద్రా తన వినియోగదారుల కోసం ధరను కూడా చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది. AX5 వేరియంట్ ధర రూ.13.89 లక్షలు కాగా, అన్ని హంగులతో కూడిన AX7L వేరియంట్ ధర రూ.14.96 లక్షలుగా ఉంది. ఎవరైనా తమ ఇంట్లోనే వేగంగా ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే, అదనంగా రూ.50,000 చెల్లించి 7.2 kW హోమ్ వాల్ ఛార్జర్‌ను పొందవచ్చు. మార్కెట్లో ఇది నేరుగా టాటా నెక్సాన్ EV, పంచ్ EV వంటి మోడల్స్‌తో పోటీ పడనుంది.

Updated On 7 Jan 2026 10:49 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story