PSU Banks : జనం డబ్బులు సేఫ్..బ్యాంకుల ప్రాఫిట్లు టాప్..2026 నాటికి విదేశీ బ్యాంకులకి చుక్కలే
2026 నాటికి విదేశీ బ్యాంకులకి చుక్కలే

PSU Banks : దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల రూపురేఖలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్కెచ్ వేస్తోంది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మన బ్యాంకులు కూడా ప్రపంచ స్థాయి శక్తులుగా ఎదగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. 2026 నాటికి భారతీయ బ్యాంకింగ్ రంగం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయేలా అడుగులు పడుతున్నాయి.
ప్రస్తుతం మన దేశంలో 12 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. కానీ, ప్రపంచంలోని టాప్-50 బ్యాంకుల జాబితాలో కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే చోటు దక్కించుకుంది. ప్రైవేట్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ కూడా టాప్-100 వెలుపలే ఉంది. భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానానికి వెళ్లాలంటే, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు ఇచ్చే సామర్థ్యం మన బ్యాంకులకు ఉండాలి. అందుకే మరిన్ని బ్యాంకులను విలీనం చేసి లేదా వాటిని బలోపేతం చేసి గ్లోబల్ జెయింట్స్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది.
బ్యాంకుల సంఖ్యను తగ్గించి, వాటి పనితీరును మెరుగుపరిచే ప్రక్రియ 2017 నుంచే మొదలైంది. ఒకప్పుడు 27గా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య, 2019-20 నాటి మెగా విలీనం తర్వాత 12కి చేరింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్‌లో విలీనం కాగా.. ఓరియంటల్, యునైటెడ్ బ్యాంకులు పీఎన్‌బీలో కలిశాయి. అంతకుముందు ఎస్బీఐ తన అనుబంధ బ్యాంకులను తనలో కలిపేసుకుని రూ.44 లక్షల కోట్ల ఆస్తులతో ప్రపంచ స్థాయికి చేరింది. ఇప్పుడు రాబోయే మార్పులు దీనికి తదుపరి దశగా ఉండబోతున్నాయి.
బ్యాంకులు ఇప్పుడు మునుపెన్నడూ లేనంత బలంగా ఉండటమే ఈ సాహసోపేత నిర్ణయాలకు కారణం. 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే 12 ప్రభుత్వ బ్యాంకులు ఏకంగా రూ. 93,675 కోట్ల లాభాన్ని గడించాయి. ఈ ఏడాది ముగిసేసరికి ఈ లాభం రూ.2లక్షల కోట్లు దాటుతుందని అంచనా. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయం, యస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంకుల్లో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు భారత బ్యాంకింగ్ వ్యవస్థపై అంతర్జాతీయ స్థాయిలో నమ్మకాన్ని పెంచాయి. ఈ సానుకూల పవనాల మధ్య 2026లో బ్యాంకింగ్ రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలుకానుంది.

