ITR Filing : ఆదాయం తక్కువ ఉన్నా ఈ ఐదుగురు కూడా ఐటీఆర్ చేయాల్సిందే
ఈ ఐదుగురు కూడా ఐటీఆర్ చేయాల్సిందే

ITR Filing : తమ ఆదాయం పన్ను కట్టాల్సిన పరిమితి కంటే తక్కువ ఉంటే, ఆదాయపు పన్ను రిటర్న్ వేయాల్సిన అవసరం లేదని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ సంపాదన తక్కువైనా సరే, ITR ఫైల్ చేయడం తప్పనిసరి. ఆ 5 ముఖ్యమైన సందర్భాలు ఏంటో చూద్దాం.
1. కరెంట్ అకౌంట్‌లో రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ వేస్తే
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంక్ కరెంట్ అకౌంట్‌లో రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ జమ చేస్తే, మీరు తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఈ మొత్తం మీ వేర్వేరు కరెంట్ అకౌంట్లలో కలిపి కోటి దాటినా ఈ నియమం వర్తిస్తుంది. ఇది వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారికి చాలా ముఖ్యం.
2. విదేశీ ప్రయాణానికి రూ. 2 లక్షలు ఖర్చు చేస్తే
మీరు వెకేషన్‌కు కానీ, బిజినెస్ పని మీద కానీ విదేశాలకు వెళ్లి, ఆ పర్యటనలో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. మీరు మీ కుటుంబం లేదా బంధువుల టిక్కెట్లు, హోటల్ ఖర్చులు భరించినా కూడా ఈ నియమం వర్తిస్తుంది.
3. ఏడాదికి విద్యుత్ బిల్లు రూ.లక్ష దాటితే
మీ ఇంటి కరెంట్ బిల్లు మొత్తం సంవత్సరానికి రూ.లక్ష కంటే ఎక్కువ వస్తే, మీరు ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి. అంటే, మీ నెలవారీ కరెంట్ బిల్లు సుమారు రూ. 8,500 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీరు ఈ పరిధిలోకి వస్తారు.
4. టీడీఎస్ రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ కట్ అయితే
మీకు సంవత్సరంలో రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ టీడీఎస్ కట్ అయితే, మీరు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. సీనియర్ సిటిజన్‌లకు ఈ లిమిట్ రూ. 50,000గా ఉంది. ఐటీఆర్ వేయడం ద్వారా అదనంగా కట్ అయిన టీడీఎస్ ని తిరిగి పొందవచ్చు.
5. విదేశాల్లో ఆస్తి లేదా బ్యాంక్ ఖాతా ఉంటే
మీకు విదేశాల్లో ఏదైనా ఆస్తి ఉంటే, లేదా ఏదైనా విదేశీ బ్యాంక్ ఖాతాలో మీకు సైనింగ్ అథారిటీ ఉంటే, మీరు తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండవు.
ఐటీఆర్ ఎందుకు ముఖ్యం?
ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల పన్ను విషయంలో క్లియరెన్స్ రావడమే కాకుండా, భవిష్యత్తులో లోన్ తీసుకోవడానికి, వీసా కోసం అప్లై చేయడానికి, లేదా ఏ పెద్ద ఆర్థిక లావాదేవీలకైనా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఐటీఆర్ అనేది మీ ఆర్థిక లావాదేవీలకు ఒక ముఖ్యమైన రుజువు. కాబట్టి, పైన చెప్పిన సందర్భాల్లో మీరు వస్తే, ఆలస్యం చేయకుండా ఐటీఆర్ ఫైల్ చేయండి. లేదంటే జరిమానాలతో పాటు చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
