మూడు రోజుల్లో రూ.21 లక్షల కోట్లు హాంఫట్

Stock Market Crash : మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ షేర్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్లు భారీగా షేర్లను విక్రయించడంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. గడిచిన 11 నెలల కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి సూచీలు పడిపోవడం మదుపర్లను ఆందోళనకు గురిచేస్తోంది. గత మూడు రోజుల్లోనే మార్కెట్ 4 శాతం నష్టపోగా, దాదాపు రూ.21 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

బుధవారం ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1123 పాయింట్లు (1.40%) పడిపోయి 79,116.19 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మధ్యలో ఒక దశలో సెన్సెక్స్ 1,800 పాయింట్ల వరకు పతనమై 78,443 స్థాయికి చేరుకుంది. కేవలం మూడు రోజుల క్రితం 82,248 వద్ద ఉన్న సెన్సెక్స్, ఇప్పుడు 79 వేల స్థాయికి పడిపోవడం మార్కెట్ తీవ్రతను తెలియజేస్తోంది. అంటే మూడు రోజుల్లోనే సెన్సెక్స్ 3,132 పాయింట్లు నష్టపోయింది.

ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 385 పాయింట్లు నష్టపోయి 24,480.50 వద్ద స్థిరపడింది. గత మూడు రోజుల్లో నిఫ్టీ ఏకంగా 1,016 పాయింట్లు కోల్పోయింది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మార్కెట్‌ను దెబ్బతీశాయి. దీనివల్ల బుధవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

అయితే, నిరాశలో ఉన్న ఇన్వెస్టర్లకు ఒక చిన్న ఆశ కిరణం కనిపిస్తోంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కొన్ని షరతులతో కూడిన ప్రతిపాదనలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఒకవేళ ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గితే, గురువారం మార్కెట్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. లేదంటే రాబోయే రోజుల్లో మార్కెట్ మరిన్ని కనిష్ట స్థాయిలను చూడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story