Bank Strike: వారానికి 5 రోజులే పని.. సెప్టెంబర్ 28 నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ?
బ్యాంకులు బంద్ ?

Bank Strike: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌తో పాటు వివిధ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే ఈ సమ్మె నిర్ణయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులు సమ్మె ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని, వివాదాస్పద అంశాలపై చర్చల ద్వారా మాత్రమే సానుకూల పరిష్కారం కనుగొనాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.
వ్యాపారాలు, ఖాతాదారులపై తీవ్ర ప్రభావం
ఒకవేళ ఈ సమ్మె కనుక నిజంగా జరిగితే దేశంలోని బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. సెప్టెంబర్ 28కి ముందు వారానికి సంబంధించిన సాధారణ వీకెండ్ సెలవులు రావడం వల్ల, దాదాపు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా, ఈ సమ్మె సమయం బ్యాంకుల హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ అనగా సెప్టెంబర్ 30 గడువుతో నేరుగా ముడిపడి ఉంది. ఖాతాల మిల్లింగ్, ప్రొవిజనింగ్, ట్రెజరీ, మార్కెట్ ఆపరేషన్స్ వంటి అత్యంత కీలకమైన ఆర్థిక కార్యక్రమాలకు ఈ సమయం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో సమ్మె జరిగితే సామాన్య ప్రజలతో పాటు చిన్న, పెద్ద వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ తాము ఇప్పటికే అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని, ఉద్యోగుల సేవలను గుర్తించి అన్ని స్థాయిల సిబ్బందికి వేతనాలు, భత్యాలను పెంచామని పేర్కొంది. కొత్త పే-స్కేల్ అమలుతో పాటు స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ పరిధిని కూడా విశాలం చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించిన పర్ఫామెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌ను సైతం యూనియన్లతో చర్చించిన తర్వాతే నిలిపివేశామని ప్రభుత్వం గుర్తుచేసింది.
ముందస్తు వేతన ఒప్పందాలు
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ, కొత్త ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించిన చర్చలను నవంబర్ 2027 డెడ్‌లైన్‌కు ముందే చాలా త్వరగా ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందని పేర్కొంది. ఇక ఐదు రోజుల పనిదినాల డిమాండ్ విషయానికి వస్తే, రెండో, నాలుగో శనివారాలు మినహా మిగిలిన శనివారాల్లో కూడా బ్యాంకులు తెరిచి ఉండటం ప్రజల నిత్యవసరాలకు ఎంతో అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి సమ్మె వంటి కఠిన నిర్ణయాలను పక్కన పెట్టి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేసింది.

