FII : బ్యాంకింగ్ దిగ్గజాలకు షాక్.. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రూ.45 వేల కోట్ల అవుట్
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రూ.45 వేల కోట్ల అవుట్

FII : భారతీయ బ్యాంకింగ్ దిగ్గజాలకు మార్చి త్రైమాసికం గండంలా మారింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడంతో స్టాక్ మార్కెట్‌లో కలకలం రేగింది. కేవలం ఈ రెండు బ్యాంకుల నుంచే సుమారు రూ.45,000 కోట్ల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మేయడం విశేషం. బ్యాంకులు లాభాల్లో ఉన్నప్పటికీ, షేర్ల ధరలు మాత్రం పాతాళానికి పడిపోవడంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.
మార్చి త్రైమాసికంలో భారతీయ ఆర్థిక రంగం నుంచి మొత్తం రూ.60,000 కోట్ల విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లగా, అందులో సింహభాగం అంటే 75 శాతం కేవలం హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచే జరగడం గమనార్హం. గణాంకాల ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.35,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి, దీనివల్ల ఆ బ్యాంకులో ఎఫ్ఐఐల వాటా 47.66% నుంచి 44%కి పడిపోయింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.10,000 కోట్ల విక్రయాలు జరగడంతో, అక్కడ విదేశీ వాటా 43.87% నుంచి 34.48%కి గణనీయంగా తగ్గింది.
ఎందుకీ అమ్మకాల జోరు?
ఈ భారీ విక్రయాల వెనుక పలు బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్ ఆకస్మిక రాజీనామా కార్పొరేట్ గవర్నెన్స్ పై ఇన్వెస్టర్లలో అనుమానాలను రేకెత్తించింది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ట్రేడ్ వార్, పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ నిబంధనలను కఠినతరం చేయడం మరో కారణం. బ్యాంకుల నెట్ ఓపెన్ పొజిషన్ పరిమితిని 100 మిలియన్ డాలర్లకు తగ్గించడం వల్ల బ్యాంకుల ట్రెజరీ ఆదాయం దెబ్బతింటుందనే భయం ఇన్వెస్టర్లను వెంటాడింది.
షేర్ల పతనం - ఆందోళనలో ఇన్వెస్టర్లు
ఈ పరిణామాల వల్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఏకంగా 26 శాతం కుంగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా 10 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ 50,సెన్సెక్స్ పతనం కంటే ఈ బ్యాంకుల పతనం ఎక్కువగా ఉండటం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐటీ రంగంతో పాటు బ్యాంకింగ్ రంగం కూడా కుదేలవ్వడం స్టాక్ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, ఇంతటి అమ్మకాలు జరుగుతున్నా బ్యాంకుల పునాదులు మాత్రం బలంగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కోలుకుంటాయా?
పెట్టుబడులు వెనక్కి వెళ్లినప్పటికీ, రెండు బ్యాంకుల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. బ్యాంకుల నికర లాభాలు పెరగడం, మొండి బకాయిలు అదుపులో ఉండటం, బ్యాలెన్స్ షీట్లు పకడ్బందీగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఇవి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. బ్యాంకుల యాజమాన్యాలు కూడా భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పతనం కేవలం తాత్కాలికమేనని, విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

