LPG Ship : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, సామాన్యుడి వంటింట్లో మంట ఆరకుండా కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య గొడవలతో గ్యాస్ సరఫరాకు ఆటంకం కలుగుతుందేమో అన్న ఆందోళనలకు చెక్ పెడుతూ.. భారీ ఎత్తున ఎల్పీజీ నిల్వలు భారత్‌కు చేరుకుంటున్నాయి. సుమారు 46,313 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తున్న భారీ నౌక సురక్షితంగా ప్రమాదకరమైన హార్ముజ్ జలసంధిని దాటేసింది. ఇది వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎం.టి సర్వ శక్తి అనే భారీ ఎల్పీజీ నౌక 46,313 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో భారత్‌కు వస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఈ నౌక సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటేసింది. మే 13, 2026 నాటికి ఇది విశాఖపట్నం పోర్టుకు చేరుకోనుంది. దీనివల్ల దేశంలో గ్యాస్ సరఫరా మరింత మెరుగుపడుతుందని, ఎక్కడా నిల్వలు అయిపోయే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ వ్యవస్థను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఆన్‌లైన్ బుకింగ్స్ దాదాపు 99 శాతానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్ గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచారు. మే 2వ తేదీ ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 47 లక్షల సిలిండర్లను డెలివరీ చేయడం విశేషం. పీఎన్జీ, సీఎన్జీ సరఫరా కూడా 100 శాతం నిరంతరాయంగా కొనసాగుతోంది.

వాణిజ్య అవసరాల కోసం వాడే గ్యాస్ సరఫరాలో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఫార్మా రంగానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. వలస కార్మికులు, పేదల కోసం 5 కేజీల చిన్న సిలిండర్ల విక్రయాలను కూడా పెంచింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 23.44 లక్షల చిన్న సిలిండర్లు అమ్ముడయ్యాయి. చమురు సంస్థలు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా అవగాహన సదస్సులు నిర్వహించి వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి.

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నిత్యావసర వస్తువుల చట్టం కింద రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. ఇప్పటి వరకు 1900 పైగా దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 349 మంది డిస్ట్రిబ్యూటర్లపై చర్యలు తీసుకున్నారు. అందులో 74 మంది లైసెన్సులను రద్దు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయని, ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించడం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా చూస్తున్నామని కేంద్రం తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story