Gautam Adani: అదానీ గ్రూప్‌కు అమెరికా నుంచి బిగ్ రిలీఫ్.. క్రిమినల్ కేసు కొట్టివేసిన యూఎస్ కోర్టు
క్రిమినల్ కేసు కొట్టివేసిన యూఎస్ కోర్టు

Gautam Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కంపెనీలోని అగ్రశ్రేణి అధికారులకు అమెరికా న్యాయస్థానం నుంచి ఎంతో ఊరట లభించింది. తమపై నమోదైన క్రిమినల్ కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు పూర్తిగా కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా న్యాయశాఖ కేసును ముందుకు తీసుకెళ్లకూడదని భావించిన తర్వాత, యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గారౌఫిస్ మోసం, లంచం ఆరోపణలను తొలగించారు. ఈ తీర్పు అదానీ గ్రూప్ విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి చాటిచెప్పింది.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. "అమెరికా కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఎంతో వినమ్రతతో, న్యాయ వ్యవస్థపై ఉన్న అత్యున్నత గౌరవంతో స్వాగతిస్తున్నాను. అత్యంత కష్టకాలంలో కూడా నిజాయితీ, నిష్పాక్షికత, చట్ట నియమాలపై మాకు ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదు" అని ఆయన పేర్కొన్నారు. తమ గ్రూప్ పై, భారతీయ న్యాయ వ్యవస్థపై, తమ సమగ్రతపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా గౌతమ్ అదానీ ధన్యవాదాలు తెలిపారు.
సోలార్ పవర్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి కొందరు అధికారులకు లంచాలు ఇచ్చారని, అమెరికన్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని గౌతమ్ అదానీతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ అధికారులపై అమెరికాలో గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే మొదటి నుంచీ అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వచ్చింది. ఇవి కేవలం ఆధార రహితమైన పుకార్లని, తాము దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, న్యాయ నిబంధనలకు 100 శాతం కట్టుబడి పనిచేస్తున్నామని గ్రూప్ స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు కేసును పూర్తిగా కొట్టివేయడంతో గ్రూప్ వాదన నిజమైంది.
అమెరికా వంటి అత్యంత కఠినమైన నిబంధనలు ఉన్న దేశంలో ఈ రకమైన కేసు కొట్టివేయబడటం అదానీ గ్రూప్‌కు గ్లోబల్ బిజినెస్ స్థాయిలో దక్కిన అతిపెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో గ్రూప్ ప్రమాణాలు చాలా బలంగా ఉన్నాయనే సంకేతాన్ని ఇది ప్రపంచ మార్కెట్లకు పంపింది. ఈ తీర్పుతో అదానీ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్ల నమ్మకం పెరిగి భారీ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గ్రూప్ చేపట్టబోయే రాబోయే అంతర్జాతీయ ప్రాజెక్టులు, ఫండింగ్ ప్రణాళికలకు కూడా ఇది కొత్త ఊపునివ్వనుంది.

