25మంది కూడా ఆన్ లైన్ షాపింగ్ చేయట్లేదట

Online Shopping : మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటారా? అయితే మీలా చేసేవాళ్ళు మన దేశంలో చాలా తక్కువ మందే ఉన్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమని ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నివేదిక చెబుతోంది. మెకిన్సీ అండ్ కంపెనీ అనే గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతీయ ఈ-కామర్స్ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉందట. భవిష్యత్తులో ఈ రంగం భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. మెకిన్సీ కంపెనీ నివేదిక ప్రకారం, భారతదేశంలో ఇంటర్నెట్ వాడే వారిలో కేవలం 20 నుంచి 25 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారట. అంటే, సుమారు 85 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నా, అందులో 20 కోట్ల మంది కన్నా తక్కువ మందే ఆన్‌లైన్ షాపింగ్‌ను వాడుకుంటున్నారు.

అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే, భారతదేశంలో ఈ-కామర్స్ ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉందని మెకిన్సీ నివేదిక తేటతెల్లం చేసింది. ఆ దేశాల్లో ఇంటర్నెట్ వాడేవారిలో 85 శాతానికి పైగా ప్రజలు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తుంటారు. కానీ మన ఇండియాలో ఇది కేవలం 20-25 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఈ-కామర్స్ కార్యకలాపాలు బాగా పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ వేగంగా విస్తరిస్తోంది. అంతేకాకుండా, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు కూడా కనిపిస్తున్నాయి. చాలా వేగంగా వస్తువులను డెలివరీ చేసే క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు బాగా పుంజుకుంటున్నాయని మెకిన్సీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఉదాహరణకు, నిమిషాల్లో కిరాణా సరుకులు, ఇతర వస్తువులు డెలివరీ చేసే ప్లాట్‌ఫామ్‌లు బాగా పాపులర్ అవుతున్నాయి.

మెకిన్సీ నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో జరిగిన మొత్తం రిటైల్ అమ్మకాలలో ఈ-కామర్స్ వాటా కేవలం 7 నుంచి 9 శాతం మాత్రమే. అయితే, రాబోయే నాలుగు-ఐదు సంవత్సరాల్లో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. 2030 నాటికి, మొత్తం రిటైల్ అమ్మకాలలో ఈ-కామర్స్ వాటా 15 శాతం నుంచి 17 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే, భారతీయ ఈ-కామర్స్ రంగానికి ఇంకా చాలా పెద్ద భవిష్యత్తు ఉందని అర్థమవుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల వాడకం, ఇంటర్నెట్ అందుబాటు పెరిగే కొద్దీ ఆన్‌లైన్ షాపింగ్ మరింత విస్తరిస్తుంది అనడంలో సందేహం లేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story