స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీకి రెడీ

Meesho : తక్కువ ధరలకే వస్తువులను అమ్మే ఈ-కామర్స్ దిగ్గజం 'మీషో'త్వరలో షేర్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ దిశగా కంపెనీ ఒక పెద్ద అడుగు వేసింది. తనను తాను ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకుంది. ఇకపై కంపెనీ అధికారిక పేరు 'మీషో లిమిటెడ్'గా మారనుంది. ఐపీఓ తీసుకురావడానికి ముందు జరిగే ఒక ముఖ్యమైన చట్టపరమైన ప్రక్రియ ఇది. కంపెనీ షేర్ మార్కెట్లో లిస్టింగ్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఇది సూచిస్తుంది.

ఐపీఓ కోసం సన్నాహాలు

మీషో ఇంకా ఐపీఓ కోసం DRHP (Draft Red Herring Prospectus) దాఖలు చేయలేదు. అయితే, కంపెనీ తన ఫైలింగ్‌లలో స్పష్టంగా పేర్కొంది. తాము వృద్ధి కోసం రకరకాల అవకాశాలను అన్వేషిస్తున్నామని, ఇందులో సరైన సమయంలో ఐపీఓ తీసుకురావడం, భారతదేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్ అవ్వడం కూడా ఉన్నాయని తెలిపింది.

మీషో హవా

బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ (CLSA) నివేదిక ప్రకారం.. 2024లో భారతదేశ మొత్తం ఈ-కామర్స్ ఆర్డర్లలో 37శాతం వాటా కేవలం మీషోదే. కంపెనీ ప్లాట్‌ఫామ్‌లో డిసెంబర్ 2024 నాటికి ఏకంగా 18.7 కోట్ల మంది కస్టమర్లు కొనుగోళ్లు చేశారు. ఇది మీషో ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందో ఎంత వేగంగా పాపులర్ అవుతుందో చూపిస్తుంది.

లాభాల బాటలో మీషో

మీషో ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు క్రమంగా బలపడుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో (FY24) కంపెనీ ఆదాయం 33% పెరిగి రూ.7,615 కోట్లకు చేరుకుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, కంపెనీ నష్టాలు దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి. FY24లో నష్టం కేవలం రూ.53 కోట్లు మాత్రమే. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే 97శాతం తక్కువ. అంటే, కంపెనీ ఇప్పుడు లాభాల దిశగా చాలా వేగంగా, పటిష్టంగా అడుగులు వేస్తోంది.

ఐపీఓ ప్రక్రియకు పెద్ద బ్యాంకులు

మీషో తన ఐపీఓను విజయవంతం చేయడానికి కోటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రపంచ స్థాయి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల సర్వీసులను తీసుకుంది. కంపెనీ $10 బిలియన్లు (సుమారు 83,000 కోట్లు) వాల్యుయేషన్‌తో లిస్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story