Electric Vehicle Stocks : మార్కెట్ పడినా తగ్గని క్రేజ్.. ఐదేళ్లలో 4600 శాతం రిటర్న్స్ ఇచ్చిన ఎలక్ట్రిక్ కారు కంపెనీ
ఐదేళ్లలో 4600 శాతం రిటర్న్స్ ఇచ్చిన ఎలక్ట్రిక్ కారు కంపెనీ

Electric Vehicle Stocks : షేర్ మార్కెట్ ఒడిదుడుకులతో బెంబేలెత్తిస్తున్నా, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్ మాత్రం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. బుధవారం సెన్సెక్స్ తన గరిష్ట స్థాయి నుండి ఏకంగా 800 పాయింట్లు పతనమై టెన్షన్ పెట్టినా, స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ మర్క్యూరీ ఈవీ-టెక్ షేర్లు మాత్రం 9 శాతం వరకు లాభపడి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒకప్పుడు పెన్నీ స్టాక్‌గా ఉన్న ఈ షేరు, గత ఐదేళ్లలో ఇన్వెస్టర్ల సంపదను ఏకంగా 46 రెట్లు పెంచడం విశేషం.
బుధవారం ట్రేడింగ్ విషయానికి వస్తే.. ఉదయం ఫ్లాట్‌గా రూ. 32.72 వద్ద ప్రారంభమైన ఈ షేరు, మధ్యాహ్నానికి ఊపందుకుని రూ.35.55 గరిష్ట స్థాయిని తాకింది. అయితే, గత ఏడాది కాలంగా చూస్తే ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ట స్థాయి (రూ.76.93) నుంచి దాదాపు 50 శాతం పైగా పతనమై ఉంది. ఫిబ్రవరి నెలలో కూడా ఈ షేరు 6 శాతం వరకు నష్టపోయింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మాత్రం ఈ కంపెనీ 4,650 శాతం రిటర్న్స్ ఇచ్చి 'కుబేరులను' చేసింది. అంటే ఐదేళ్ల క్రితం ఎవరైనా లక్ష రూపాయలు పెట్టి ఉంటే, నేడు దాని విలువ దాదాపు రూ. 46 లక్షలకు పైగా ఉండేది.
కంపెనీ ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే.. 2026 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో రూ. 25.29 కోట్ల నికర అమ్మకాలు, రూ. 0.89 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో మొత్తం అమ్మకాలు రూ. 81.86 కోట్లుగా నమోదయ్యాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ కంపెనీపై నమ్మకంతో తమ వాటాను పెంచుకుంటున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో వీరు దాదాపు 14.71 లక్షల షేర్లను కొనుగోలు చేయడంతో, వీరి వాటా 1.90 శాతం నుండి 2.68 శాతానికి పెరిగింది.
1986లో ప్రారంభమైన మర్క్యూరీ ఈవీ-టెక్, ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకుపోతోంది. ఈ కంపెనీ కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు, బస్సులనే కాకుండా.. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వింటేజ్ వాహనాలు, గోల్ఫ్ కార్ట్‌లను కూడా తయారు చేస్తోంది. హోటల్, పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ సొల్యూషన్స్‌ను అందిస్తూ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. షార్ట్ టర్మ్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఫ్యూచర్ అంతా ఈవీదే కావడంతో ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌పై ఆశలు పెట్టుకున్నారు.

