Meta Layoffs : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా(ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ) ఐటీ పరిశ్రమలో మరోసారి లేఆఫ్స్ బాంబు పేల్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డ మెటా.. వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించింది. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, తెల్లవారుజామున 4 గంటలకే ఉద్యోగుల పర్సనల్ ఈమెయిళ్లకు మీ ఉద్యోగం పోయింది అంటూ మెటా యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. దీంతో టెక్ ప్రపంచంలో ఒకేసారి తీవ్ర కలకలం రేగడమే కాకుండా, భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాల మనుగడపై సరికొత్త చర్చకు దారితీసింది.

8 వేల మందికి పింక్ స్లిప్స్

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉంది. మరోవైపు, సుమారు 7,000 మంది పాత ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఏఐ ఆధారిత విభాగాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ లేఆఫ్స్ దెబ్బ ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ టీమ్స్‌పై పడింది. సంస్థలో మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించి, చిన్న చిన్న గ్రూపులతో వేగంగా పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా మెటా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కంపెనీకి చెందిన దాదాపు 6,000 కొత్త జాబ్ నోటిఫికేషన్లను కూడా మెటా తక్షణమే రద్దు చేసింది.

ఉద్యోగుల తీవ్ర ఆగ్రహం

ఈ లేఆఫ్స్ ప్రక్రియ అమలు చేసిన తీరుపై మెటా ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్, అమెరికా, బ్రిటన్‌తో సహా పలు దేశాల్లోని ఉద్యోగులకు అర్ధరాత్రి, తెల్లవారుజామున 4 గంటల సమయంలో టెర్మినేషన్ ఈమెయిళ్లు వచ్చాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆఫీస్ సిస్టమ్స్ లాగిన్ ఐడీలను బ్లాక్ చేసేశారు. అమెరికా, యూకేలోని చాలా మంది ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. లేఆఫ్స్ ప్రక్రియలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకే మెటా ఈ దొంగచాటు మెయిల్స్ వ్యూహాన్ని అమలు చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు.

1000 మంది సంతకాలతో పిటిషన్

మరోవైపు మెటా సంస్థ ఆఫీసుల్లో ప్రవేశపెట్టిన కొత్త ట్రాకింగ్ సిస్టమ్ ఉద్యోగుల మధ్య పెద్ద వివాదానికి కారణమైంది. ఉద్యోగులు సీట్లలో కూర్చుని ఎంతసేపు కీబోర్డ్ టైప్ చేస్తున్నారు? మౌస్ కదలికలు ఎలా ఉన్నాయి? స్క్రీన్ యాక్టివిటీ ఏంటి? అనే ప్రతీ చిన్న విషయాన్ని ఈ సాఫ్ట్‌వేర్ నిరంతరం ట్రాక్ చేస్తోంది. తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ, నమ్మకం లేని వాతావరణాన్ని సృష్టిస్తున్న ఈ నిఘా వ్యవస్థకు వ్యతిరేకంగా ఇప్పటికే 1,000 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేసి కంపెనీకి ఒక నిరసన పిటిషన్‌ను సమర్పించారు.

ఏఐ ప్రాజెక్టుల కోసం రూ.12 లక్షల కోట్ల భారీ బడ్జెట్

సాధారణ ఉద్యోగులను తొలగిస్తున్న మెటా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మాత్రం భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ఏఐ ఏజెంట్లు, అత్యాధునిక ఏఐ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం కోసం మార్క్ జుకర్‌బర్గ్ ఏకంగా 100 బిలియన్ డాలర్ల నుండి 145 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12 లక్షల కోట్లు) భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఈ భారీ ఖర్చుల కోసమే సాధారణ టీమ్‌లను తగ్గించి మేనేజ్‌మెంట్ ఖర్చులను కట్ చేస్తున్నారు. ఐటీ రంగ నిపుణుల ప్రకారం.. ఈ ట్రెండ్ కేవలం మెటాతోనే ఆగదని, రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి మిగతా టెక్ దిగ్గజాలు కూడా ఇదే దారిలో ప్రయాణించే ప్రమాదం ఉందని, దీనివల్ల టెక్ రంగంలో ఉద్యోగాల స్వరూపమే మారిపోతుందని హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story