VB-G RAM G : గ్రామీణ ఉపాధి రంగంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ చట్టం(VB-G RAM G Act, 2025)ను తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూనే, కూలీలకు మరింత ఎక్కువ పనిదినాలను కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

ఈ కొత్త చట్టం వల్ల గ్రామీణ కూలీలకు కలిగే అతిపెద్ద ప్రయోజనం పనిదినాల పెంపు. ఇప్పటివరకు మనరేగా కింద ఏడాదికి 100 రోజుల పని గ్యారెంటీ ఉండగా, దానిని ఇప్పుడు 125 రోజులకు పెంచారు. అంటే ప్రతి కుటుంబానికి అదనంగా 25 రోజుల ఉపాధి లభిస్తుంది. కేవలం గుంతలు తవ్వడం వంటి పనులకే పరిమితం కాకుండా.. నీటి భద్రత, గ్రామీణ రోడ్లు, వాతావరణ మార్పులను తట్టుకునేలా మౌలిక సదుపాయాల కల్పన వంటి నాలుగు కీలక విభాగాల్లో పనులు చేపట్టనున్నారు.

కొత్త చట్టంలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఇకపై కూలీల హాజరును కేవలం సంతకాలు లేదా వేలిముద్రలతో కాకుండా.. ఫేస్ అథెంటికేషన్ ద్వారా నమోదు చేస్తారు. దీనివల్ల ఫేక్ మస్టర్ రోల్స్, అవినీతికి చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సిగ్నల్ లేని ప్రాంతాల్లో లేదా సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు కూలీలకు ఇబ్బంది కలగకుండా మినహాయింపులు కూడా ఇస్తారు. అలాగే, పంటల సాగు, కోత సమయాల్లో (పీక్ అగ్రికల్చర్ సీజన్) ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తారు, తద్వారా వ్యవసాయానికి కూలీల కొరత లేకుండా చూస్తారు.

మనరేగా నుంచి కొత్త చట్టానికి మారే ప్రక్రియ చాలా స్మూత్‌గా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న జాబ్ కార్డ్స్ (e-KYC పూర్తయినవి) కొత్త గ్రామీణ ఉపాధి గ్యారెంటీ కార్డ్స్ వచ్చే వరకు చెల్లుబాటు అవుతాయి. నిధుల విషయానికి వస్తే.. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో, ఇతర రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భరిస్తాయి. కూలీల డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే (DBT ద్వారా) జమ అవుతుంది.

కొత్త చట్టం వచ్చినా కొన్ని పాత నిబంధనలు అలాగే కొనసాగుతాయి. పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. వారానికోసారి లేదా గరిష్టంగా రెండు వారాల్లోగా కూలీ డబ్బులు చెల్లించాలి. ఒకవేళ చెల్లింపుల్లో ఆలస్యమైతే నష్టపరిహారం ఇచ్చే నిబంధనను కూడా ప్రభుత్వం కొనసాగించింది. గ్రామాల అభివృద్ధిని వికసిత్ గ్రామ పంచాయితీ ప్లాన్స్ (VGPP) ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story