Job Cuts: ఐటీ ఉద్యోగులకు మళ్లీ కష్టకాలం.. మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థల్లో 23 వేల మందిపై వేటు
మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థల్లో 23 వేల మందిపై వేటు

Job Cuts : ఐటీ రంగంలో మరోసారి గండం ముంచుకొస్తోంది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతుండటమే ఈ గండానికి ప్రధాన కారణం. ఖర్చులను తగ్గించుకుని, ఏఐ వైపు మళ్లే క్రమంలో దాదాపు 23,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
మెటాలో 8 వేల మందిపై వేటు
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫార్మ్స్ మరోసారి భారీ లేఆఫ్ కు సిద్ధమైంది. తన అంతర్గత మెమోలో వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం సిబ్బందిలో 10 శాతం అంటే సుమారు 8,000 మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభం కానుంది. ఇంతేకాకుండా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న మరో 6,000 పోస్టులను కూడా భర్తీ చేయకూడదని మెటా నిర్ణయించుకుంది. అంటే మొత్తం మీద 14 వేల మంది పనిభారం పెరగడమో లేదా కొత్త అవకాశాలు తగ్గిపోవడమో జరగనుంది. కంపెనీని మరింత చురుగ్గా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్ టీమ్ చెబుతోంది.
మైక్రోసాఫ్ట్ బైఅవుట్ ప్లాన్
ఇక మైక్రోసాఫ్ట్ తన అమెరికన్ ఉద్యోగుల కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని వాలంటరీ బైఅవుట్ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నారు. అంటే ఉద్యోగులే స్వచ్ఛందంగా కంపెనీ నుంచి తప్పుకుంటే వారికి కొంత ప్యాకేజీ ఇచ్చి పంపించేస్తారు. అమెరికాలో ఉన్న 1.25 లక్షల మంది సిబ్బందిలో సుమారు 7 శాతం మంది (దాదాపు 8,750 మంది) ఈ ఆఫర్‌కు అర్హులుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద బైఅవుట్ ప్రక్రియగా రికార్డులకు ఎక్కనుంది.
ఏఐపై పెట్టుబడుల కోసమే ఈ త్యాగాలా?
టెక్ కంపెనీలు ఎందుకు ఇలా చేస్తున్నాయనే సందేహం రావచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిచ్చి పీక్స్‌లో ఉంది. మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ల విస్తరణ కోసం జపాన్, ఆస్ట్రేలియాలో బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తోంది. అలాగే మెటా కూడా ఏఐ భాగస్వామ్యాల కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. ఈ భారీ ఖర్చులను బ్యాలెన్స్ చేయాలంటే జీతాల రూపంలో వెళ్లే ఖర్చును తగ్గించుకోవడం ఒక్కటే మార్గమని ఈ కంపెనీలు భావిస్తున్నాయి.
టెక్ సెంటర్‌లో ఆందోళన
గత రెండేళ్లుగా ఐటీ రంగంలో ఏదో ఒక మూల ఉద్యోగాల కోత వినబడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఏఐ రాకతో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సాదాసీదా కోడింగ్ చేసే వారి అవసరం క్రమంగా తగ్గుతుండటంతో, కంపెనీలు మరింత స్కిల్ ఉన్న తక్కువ మంది సిబ్బందితో పనిచేయాలని ప్లాన్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో గూగుల్, అమెజాన్ వంటి ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఇప్పుడు కేవలం తమ పని మీద మాత్రమే కాకుండా, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

