Middle Management : కార్పొరేట్ రంగంలో మిడిల్ మేనేజ్మెంట్ జాతర.. బంపర్ రిక్రూట్మెంట్తో పాటు భారీగా పెరగనున్న జీతాలు
బంపర్ రిక్రూట్మెంట్తో పాటు భారీగా పెరగనున్న జీతాలు

Middle Management : భారత కార్పొరేట్ రంగంలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న నిపుణులకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారీ డిమాండ్ ఉండబోతోందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జీనియస్ హెచ్ఆర్ టెక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం అనుభవజ్ఞులైన మధ్యస్థాయి ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. వీరి వేతనాల్లో కూడా 5 నుంచి 10 శాతం వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
జీనియస్ హెచ్ఆర్ టెక్ నివేదిక ప్రకారం.. సుమారు 49 శాతం కంపెనీలు మధ్యస్థాయి నిపుణుల భర్తీపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాయి. వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నడిపించేందుకు ఈ స్థాయి ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. దాదాపు 46 శాతం సంస్థలు తమ ఉద్యోగులకు 5 నుండి 10 శాతం వరకు వేతన పెంపును ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా, మరో 34 శాతం కంపెనీలు 10 శాతం కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. కొత్త కార్మిక చట్టాల అమలుతో సుమారు 57 శాతం కంపెనీలు తమ వేతన నిర్మాణంలో కీలక మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.
మరోవైపు, కంపెనీలను ఉద్యోగుల వలసలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమారు 55 శాతం సంస్థలు 10 నుంచి 20 శాతం మేర ఉద్యోగులు సంస్థను వీడే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఉద్యోగులు పనిలో సౌలభ్యం, మెరుగైన కెరీర్ గ్రోత్, అధిక జీతం ఆశించి త్వరగా ఉద్యోగాలు మారుతున్నారు. కేవలం ఉద్యోగ భద్రత కంటే కూడా వేతనం, కెరీర్ అవకాశాలకే యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
జీనియస్ హెచ్ఆర్ ఛైర్మన్ ఆర్.పి. యాదవ్ మాట్లాడుతూ.. 2026-27లో నియామక ప్రక్రియ డేటా ఆధారితంగా, చాలా జాగ్రత్తగా ఉంటుందని తెలిపారు. కంపెనీలు కేవలం కొత్త వారిని తీసుకోవడమే కాకుండా, ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడానికి మెరుగైన వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలు కలిగిన మధ్యస్థాయి నిపుణులకు మార్కెట్లో ఎదురులేదని ఈ నివేదిక సారాంశం.

