Glass Industry : భారతదేశంలో గాజు పరిశ్రమకు ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ గ్యాస్ ప్రాణాధారం. మిడిల్ ఈస్ట్ నుంచి గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో, భారత ప్రభుత్వం గృహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఫ్యాక్టరీలకు ఇచ్చే గ్యాస్ సరఫరాలో కోత విధించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా గాజు ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిని ఏకంగా 50 శాతానికి తగ్గించుకున్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ మోసంట్ క్రాఫ్ట్ కొంబుచా వ్యవస్థాపకుడు శిశిర్ సథ్యాన్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో డ్రింక్స్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, తమకు కావాల్సిన ప్రీమియం గ్లాస్ బాటిళ్లు మార్కెట్లో దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశపు గ్లాస్ హబ్ అని పిలిచే ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ ఈ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడి ఫ్యాక్టరీలలోని భట్టీలు నిరంతరం 1500 డిగ్రీల సెల్సియస్ వద్ద మండాలి. గ్యాస్ కొరత వల్ల ఒక్కసారి ఈ భట్టీలు చల్లబడితే, వాటిని మళ్ళీ ప్రారంభించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా తగ్గడంతో గాజు వస్తువుల ఉత్పత్తి వ్యయం 20 శాతం వరకు పెరిగింది. ఫలితంగా బాటిళ్లు, గ్లాసులు, ఇతర గాజు వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి.

గాజు కొరత ప్రభావం కేవలం శీతల పానీయాలకే పరిమితం కాలేదు. పాలు, మందులు, కాస్మెటిక్స్, మద్యం పరిశ్రమలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్యాకేజింగ్ ఖర్చులు 20 నుంచి 30 శాతం పెరగడంతో కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. చాలా కంపెనీలు కొత్త ఆర్డర్లు తీసుకోవడం ఆపివేశాయి, తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. పానీయాల కంపెనీలు తమ మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకుని, ఆ డబ్బును ప్యాకేజింగ్ కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిస్థితి త్వరలో చక్కబడేలా కనిపించడం లేదు. గ్యాస్ అవసరాల కోసం భారత్ ఎక్కువగా మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ఆధారపడి ఉంది. అక్కడ యుద్ధ మేఘాలు తొలగి, సరఫరా పునరుద్ధరించబడే వరకు గాజు పరిశ్రమకు కష్టాలు తప్పవు. రాబోయే నెలల్లో పానీయాలు, సాస్‌లు, మందుల సీసాల కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది చిన్న తరహా పరిశ్రమల మనుగడకే ముప్పుగా మారడమే కాకుండా, సామాన్య వినియోగదారులపై అదనపు భారానికి దారితీయనుంది.

Next Story