ప్రమాదంలో 178 బిలియన్ డాలర్ల వాణిజ్యం?

Middle East Crisis : మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వ్యాపార రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అక్కడ వినిపిస్తున్న బాంబుల మోత వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత మార్కెట్లు, కంపెనీలు, చివరకు సామాన్యుడి జేబుపై కూడా తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. గల్ఫ్ దేశాలు కేవలం మనకు వస్తువులను అమ్ముకునే మార్కెట్లు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు సరుకులను పంపే అత్యంత కీలకమైన రవాణా మార్గాలు కూడా. ఈ అనిశ్చితి వల్ల ముఖ్యంగా ఇంధనం, కెమికల్స్, వజ్రాలు, ఆభరణాల ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు.

ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఎగుమతిదారులు, దిగుమతిదారులు ఇప్పుడు న్యాయ నిపుణుల చుట్టూ తిరుగుతున్నారు. గగనతల, సముద్ర మార్గాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో ఓడలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీనివల్ల రేవుల్లో, గోదాముల్లో సరుకు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఫలితంగా కంపెనీలు భారీగా డెమరేజ్ చెల్లించాల్సి వస్తోంది. వ్యాపారులు తమ ఒప్పందాల్లోని ఫోర్స్ మెజర్ (నియంత్రణ లేని అసాధారణ పరిస్థితులు) క్లాజును అమలు చేసి, నష్టాల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్నారు. కరోనా కష్టాల నుంచి కోలుకుంటున్న తరుణంలో ఈ యుద్ధం సరఫరా గొలుసును దెబ్బతీయడం వ్యాపారవేత్తలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది.

భారతదేశం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మధ్య వాణిజ్యం సామాన్యమైనది కాదు. గత ఆర్థిక సంవత్సరంలోనే వీరి మధ్య 178.56 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. ఇది భారత్ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో సుమారు 15.42 శాతం. మనం అక్కడికి ఇంజనీరింగ్ వస్తువులు, బియ్యం, బట్టలు పంపిస్తుంటే.. అక్కడి నుంచి ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, బంగారం వంటివి దిగుమతి చేసుకుంటాం. తాజా ఉద్రిక్తతల వల్ల సరుకుల డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నో కీలక వ్యాపార ఒప్పందాలు రద్దయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక సామాన్యుడి విషయానికి వస్తే.. ఈ యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోయే అవకాశం ఉంది. రవాణా మార్గాలు మూతపడటంతో నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు పొంచి ఉంది. ఇరాన్ సైనిక శక్తి బలహీనపడటం వల్ల ఈ పోరు కొన్ని వారాల్లోనే ముగియవచ్చని కొందరు అంచనా వేస్తున్నప్పటికీ, ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుందేమోనన్న భయం వ్యాపార వర్గాల్లో కనిపిస్తోంది. సరుకులు దెబ్బతిన్నా లేదా మార్గం మార్చాల్సి వచ్చినా కలిగే ఆర్థిక నష్టాన్ని బీమా ద్వారా ఎలా రాబట్టుకోవాలో తెలియక లాజిస్టిక్ కంపెనీలు సతమతమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story