Price Hike : మిడిల్ ఈస్ట్ సంక్షోభం ఎఫెక్ట్.. ఆగస్టు నుంచి మోతక్కనున్న టీ, టీవీ, కార్లు, బట్టల ధరలు
టీ, టీవీ, కార్లు, బట్టల ధరలు

Price Hike : పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న యుద్ద ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లోని సామాన్యుల జేబులపై పడనుంది. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు పెరగడం, సముద్ర రవాణా ఛార్జీలు భారం కావడం, కరెన్సీ రూపాయి విలువ తగ్గడంతో కన్స్యూమర్ గూడ్స్ తయారీ కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఆగస్టు నెల నుంచి ప్యాక్ చేసిన టీ, హెయిర్ ఆయిల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, బట్టలు, ప్యాసింజర్ వాహనాల ధరలు 6 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశముందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. పండుగల సీజన్ ప్రారంభం కాకముందే ఈ సవరణ పూర్తి చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి.
ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ ప్రియం
ఇప్పటికే మెమరీ చిప్‌ల కొరత, ధరలు మూడు రెట్లు పెరగడంతో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలు గత కొద్ది నెలల్లో 15 శాతానికి పైగా పెరిగాయి. ఆగస్టు నెల నుంచి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలపై మరో 4 నుంచి 6 శాతం ధరలు పెంచేందుకు హాంబర్గర్, హయ్యర్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం, పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ నిల్వల రవాణా వ్యయం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీల సీఈఓలు స్పష్టం చేస్తున్నారు.
కార్లు, లగ్జరీ వాహనాలపై రూ. 30,000 వరకు భారం
ఆటోమొబైల్ రంగంలోనూ ధరల సెగ తగలనుంది. భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండోసారి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు నుంచి మారుతీ కార్ల ధరలు రూ. 30,000 వరకు పెరగనున్నాయి. అలాగే హోండా కార్స్ ఇండియా ఆగస్టు 1 నుంచి, మెర్సిడెస్ బెంజ్ రాబోయే త్రైమాసికంలో తమ వాహనాల ధరలను పెంచడానికి నిర్ణయించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు ఈ నెల ఆరంభంలోనే ధరలను సవరించిన సంగతి తెలిసిందే. దిగుమతి వ్యయం పెరగడమే కార్ల ధరల పెంపునకు కారణమని కంపెనీలు పేర్కొంటున్నాయి.
బ్రాండెడ్ బట్టలు, నిత్యావసరాల ధరలకు రెక్కలు
ఇంతకాలం పాత స్టాక్‌ను విక్రయించడం వల్ల బ్రాండెడ్ దుస్తుల ధరలను నియంత్రించిన కంపెనీలు, ఇప్పుడు కొత్త సీజన్ స్టాక్ రాకతో ధరలను 8 శాతం వరకు పెంచక తప్పడం లేదని తెలిపాయి. కెల్విన్ క్లైన్, టామీ హిల్‌ఫిగర్ వంటి బ్రాండ్లను విక్రయించే అర్వింద్ ఫ్యాషన్స్ సైతం ధరల పెంపును సూచించింది. మరోవైపు టాటా కన్స్యూమర్, బాజాజ్ కన్స్యూమర్ వంటి ఎఫ్‌ఎమ్‌సిజి కంపెనీలు సన్ ఫ్లవర్, ఆవనూనె లాంటి తినే నూనెల ఇన్పుట్ ఖర్చులు, ప్యాకేజింగ్ మెటీరియల్ భారం పెరగడంతో ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేశాయి.

