Greece: తక్కువ టాక్స్, లగ్జరీ లైఫ్.. స్వదేశం వదిలి గ్రీస్‌కు క్యూ కడుతున్న కోటీశ్వరులు
కోటీశ్వరులు

Greece: ప్రపంచవ్యాప్తంగా ఉన్నకోటీశ్వరులు ఇప్పుడు తమ స్థావరాలను గ్రీస్‌కు మార్చుకునేందుకు పోటీపడుతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ హేడ్జ్ ఫండ్ మేనేజర్ క్రిస్ రోకాస్ వంటి దిగ్గజాలు లండన్ వీడి ఎథెన్స్‌కు తరలిపోతుండటం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సరసమైన పన్ను విధానాలు, ఆహ్లాదకరమైన జీవనశైలితో గ్రీస్ ఇప్పుడు ధనికులకు కొత్త స్వర్గధామంగా మారింది. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ నివేదికల ప్రకారం గ్రీస్ దేశానికి విదేశీ ధనవంతుల రాక గణనీయంగా పెరిగింది. ప్రఖ్యాత వ్యాపారవేత్త క్రిస్ రోకాస్ గత ఏడాది బ్రిటన్‌లో సుమారు 330 మిలియన్ పౌన్లు (రూ.4,235 కోట్లు) పన్ను చెల్లించినప్పటికీ, ఇప్పుడు తన టాక్స్ రెసిడెన్సీని గ్రీస్‌కు మార్చుకోవాలని నిర్ణయించుకోవడం సంచలనం సృష్టించింది. కేవలం బ్రిటన్ నుంచి మాత్రమే కాక ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కోటీశ్వరులు ఏథెన్స్ బాట పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం గ్రీస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నాన్-డోమ్ పన్ను విధానం. ఈ పథకం కింద విదేశీ పన్ను రెసిడెంట్లు తమ విదేశీ ఆదాయం ఎంత ఉన్నప్పటికీ, ఏడాదికి కేవలం 1 లక్ష యూరోల ఫ్లాట్ టాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. గరిష్టంగా 15 ఏళ్ల పాటు ఈ సదుపాయం అందుబాటులో ఉండటం అపార కుబేరులకు భారీగా కలసివస్తోంది.
బ్రిటన్ కఠిన పన్ను నిబంధనలతో వలసలు
గతంలో బ్రిటన్ అందించిన నాన్-డోమ్ హోదాను రద్దు చేయడం, క్యాపిటల్ గెయిన్స్, వారసత్వ పన్నులపై నిబంధనలు కఠినతరం చేయడంతో ధనవంతులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బ్రిటన్ వదిలి వెళ్తున్న వారిలో కేవలం రోకాస్ మాత్రమే కాక లక్ష్మీ మిత్తల్, నసీఫ్ సావిరిస్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. బ్రిటన్ రాజధాని లండన్‌లో పన్నుల భారం విపరీతంగా పెరిగిపోవడం, పెట్టుబడులపై అనిశ్చితి ఏర్పడటంతో వ్యాపారవేత్తలు తమ సంపదను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్రీస్ ప్రభుత్వం ఇస్తున్న ఆకర్షణీయమైన టాక్స్ మినహాయింపులు వారికి ఒక గోల్డెన్ ఆప్షన్‌లా కనిపించాయి.
పన్నులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం
అలరించే సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన ఎండ, సుందరమైన వాతావరణం, యూరప్ దేశాలకు వేగవంతమైన కనెక్టివిటీ గ్రీస్ ప్రధాన బలాలుగా నిలిచాయి. లండన్ వంటి కిక్కిరిసిన, ఖరీదైన నగరాల నుంచి దూరంగా ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరుకునేవారికి గ్రీస్ అనుకూలంగా మారింది. దీనికి తోడు గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ ద్వారా ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టే వారికి సులువుగా రెసిడెన్సీ అనుమతులు లభిస్తున్నాయి. ఇటీవల ఈ రూల్స్ కాస్త మార్చినప్పటికీ, పెట్టుబడిదారుల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.
కార్పొరేట్ రంగానికి గ్రీస్ కొత్త నమూనా
టూరిజంపై మాత్రమే ఆధారపడకుండా అంతర్జాతీయ వ్యాపారాలను ఆకర్షించడమే లక్ష్యంగా గ్రీస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హెడ్జ్ ఫండ్‌లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు ప్రకటించింది. బోనస్, క్యారీడ్ ఇంటరెస్ట్‌పై కేవలం 5 శాతం పన్ను మాత్రమే విధించేలా కొత్త నిబంధనలు తెచ్చింది. క్రిస్ రోకాస్ ఎథెన్స్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభించబోతుండటం గ్రీస్ ఇమేజ్‌ను మరింత పెంచనుంది. పన్నులు ఆదా చేసుకోవడమే కాకుండా, మెరుగైన జీవన ప్రమాణాలను ఆస్వాదించవచ్చని భావించి కోటీశ్వరులు గ్రీస్ వైపు పరుగులు తీస్తున్నారు.

