ఆందోళన వెనుక అసలు కారణం ఏమిటి?

Investors : గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అత్యంత సులభమైన, నమ్మదగిన మార్గంగా మారింది. ప్రతి నెలా చిన్న మొత్తాలను పెట్టుబడి పెడుతూ, కాలక్రమేణా పెద్ద మొత్తాన్ని పోగు చేసే ఈ సౌలభ్యం లక్షలాది మంది పెట్టుబడిదారులను ఆకర్షించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. తాజాగా అందిన గణాంకాల ప్రకారం.. పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు తమ SIP లను రద్దు చేసుకుంటున్నారు. ఈ పాపులర్ పెట్టుబడి పద్ధతికి దూరంగా ఉండటానికి గల కారణాలు ఏమిటి? పెట్టుబడిదారులు ఎందుకు భయపడుతున్నారు? వివరంగా తెలుసుకుందాం.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాలు, SIPల రద్దు వేగం పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్ 2025లో సుమారు 44.03 లక్షల SIP లను పెట్టుబడిదారులు రద్దు చేసుకున్నారు. ఆగస్టులో ఈ సంఖ్య 41.15 లక్షలు మాత్రమే. అంటే, కేవలం ఒక నెలలోనే దాదాపు 7% రద్దు పెరిగింది. గత సంవత్సరం ఇదే నెలలో సుమారు 40 లక్షల SIPలు మాత్రమే రద్దు అయ్యాయి. ఈ పెరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునఃపరిశీలన చేసుకుంటున్నారని తెలుస్తోంది. కొంతమంది మార్కెట్ అనిశ్చితికి భయపడుతుంటే, మరికొంతమంది తమ ఆర్థిక లక్ష్యాలు నెరవేరడం లేదా ఫండ్ పనితీరు సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల SIP లను ఆపేస్తున్నారు.

SIP రద్దు చేసుకునే వారి సంఖ్య గత నాలుగు నెలలుగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. AMFI డేటా ప్రకారం, జూన్‌లో 48 లక్షల SIPలు రద్దు కాగా, జులైలో 43 లక్షలు, ఆగస్టులో 41 లక్షలకు తగ్గింది. కానీ సెప్టెంబర్‌లో మళ్లీ పెరిగి 44 లక్షలకు చేరుకుంది. ఈ అస్థిరమైన ధోరణి పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల విషయంలో అయోమయంలో ఉన్నారని, నిరంతరం తమ పోర్ట్‌ఫోలియోలను సమీక్షించుకుంటున్నారని తెలియజేస్తోంది.

పెట్టుబడిదారులు SIP లను నిలిపివేయడానికి అనేక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని తెలివైన ఆర్థిక నిర్ణయాలు కూడా ఉన్నాయి. చాలా మంది పెట్టుబడిదారులు ఒకే SIPలో పెద్ద మొత్తంలో పెట్టడానికి బదులుగా, తమ పెట్టుబడిని అనేక చిన్న SIPలుగా విభజించి, రిస్క్‌ను తగ్గించుకోవాలని, మెరుగైన రాబడిని పొందాలని కోరుకుంటున్నారు. దీనికోసం పాత SIP లను రద్దు చేసి, కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. కొన్నిసార్లు పెట్టుబడిదారులు తమ లక్ష్యాలు లేదా రిస్క్ సామర్థ్యానికి సరిపోలని ఫండ్‌ను ఎంచుకుంటారు. అటువంటి సందర్భంలో SIP ని ఆపివేసి, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా డబ్బును మెరుగైన ఫండ్‌కు మార్చడం సరైన నిర్ణయమే.

ఏదైనా సెక్టార్ ఆధారిత ఫండ్ దీర్ఘకాలంగా బలహీనంగా ఉంటే అందులో SIP కొనసాగించడం నష్టాన్ని పెంచుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు లార్జ్ క్యాప్ లేదా బ్రాడ్ మార్కెట్ ఫండ్స్‌కు మారడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగం కోల్పోవడం, ఊహించని వైద్య ఖర్చులు లేదా ఇతర కుటుంబ ఆర్థిక సంక్షోభాల వంటి అత్యవసర పరిస్థితులలో, నగదు లభ్యతను (Liquidity) పెంచుకోవడానికి SIP లను ఆపడం తప్పనిసరి అవుతుంది.

సాధారణంగా SIP లను ఎప్పుడూ ఆపకూడదు అని చెబుతారు. అయితే, ఆర్థిక నిపుణులు దీనితో పూర్తిగా ఏకీభవించరు. అవసరం, సరైన సలహా ఆధారంగా తీసుకునే నిర్ణయం తప్పకుండా మంచిదే. SIP నిలిపివేయడం అనేది ఎప్పుడూ చెడు నిర్ణయం కాదు. కానీ, ఆ నిర్ణయం మీ ఆర్థిక లక్ష్యాలు, అత్యవసర పరిస్థితులపై ఆధారపడి ఉండాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story