SIP : మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. మీ SIP డేట్ మిస్ అయితే ఏమవుతుంది?
మీ SIP డేట్ మిస్ అయితే ఏమవుతుంది?

SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టే వారికి అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఎస్‌ఐపీ కట్ అవ్వాల్సిన తేదీ నాటికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోవడమో లేదా నెట్‌వర్క్ సమస్యల వల్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. అయితే, ఒక నెల కిస్త్ సమయానికి కట్ కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ పూర్తిగా బంద్ అయిపోదని, మీ పాత మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఫండ్ హౌస్‌లు పెనాల్టీలు వేయవు
చాలామంది అనుకునే దానికి భిన్నంగా, ఎసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు లేదా మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు ఎస్‌ఐపీ వాయిదా మిస్ అయినందుకు ఎలాంటి అదనపు జరిమానా లేదా పెనాల్టీని వసూలు చేయవు. కేవలం ఆ నిర్దిష్ట మాసానికి సంబంధించిన పెట్టుబడి ప్రక్రియ ఆగిపోతుంది. అంటే, ఆ నెలలో మీ డబ్బులతో కొనుగోలు చేయాల్సిన ఫండ్ యూనిట్ల అలాట్‌మెంట్ జరగదు. మీ అకౌంట్లో అంతకుముందు ఉన్న పాత యూనిట్లు మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా యథావిధిగా లాభాలను అందిస్తూనే ఉంటాయి. మరుసటి నెల అకౌంట్లో డబ్బులు ఉంటే ఎస్‌ఐపీ మళ్లీ మామూలుగానే కొనసాగుతుంది.
కానీ బ్యాంకులు గట్టిగా వడ్డిస్తాయి
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వదిలేసినా, మీ ఖాతా ఉన్న బ్యాంక్ మాత్రం మిమ్మల్ని అస్సలు వదలదు. ఎస్‌ఐపీల కోసం మనం బ్యాంకులకు ఈసీఎస్ లేదా NACH ఆటో-డెబిట్ పర్మిషన్ ఇస్తాం. నిర్ణీత తేదీన అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఈ ఆటో-డెబిట్ రిక్వెస్ట్ బౌన్స్ అవుతుంది. దీనిని బ్యాంకులు తీవ్రంగా పరిగణిస్తాయి. మీ అకౌంట్ నుంచి నాచ్ బౌన్స్ ఛార్జీల పేరిట నిర్దిష్ట మొత్తాన్ని జరిమానాగా కట్ చేస్తాయి. ఈ ఛార్జీలు ఒక్కో బ్యాంకు నిబంధనలను బట్టి రూ.150 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉంది.
వరుసగా మూడు నెలలు మిస్ అయితే ఎస్‌ఐపీ రద్దు
ఒకటి లేదా రెండు నెలలు పొరపాటున ఎస్‌ఐపీ అమౌంట్ కట్ కాకపోవడం పెద్ద సమస్య కానప్పటికీ, దానిని అలవాటుగా మార్చుకోకూడదు. వరుసగా మూడు నెలల పాటు అకౌంట్ నుంచి ఎస్‌ఐపీ డబ్బులు కట్ కాకుండా విఫలమైతే, సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ మీ ఎస్‌ఐపీని శాశ్వతంగా నిష్క్రియం లేదా రద్దు చేస్తుంది. ఒకవేళ అలా ఎస్‌ఐపీ క్యాన్సిల్ అయితే, ఇన్వెస్టర్ మళ్లీ మొదటి నుంచి కొత్తగా ఎస్‌ఐపీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించాల్సి వస్తుంది. దీనివల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్ దెబ్బతింటుంది.
ఇన్వెస్టర్లకు నిపుణుల కీలక సూచనలు
దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు గడించాలంటే ఎస్‌ఐపీ పెట్టుబడులలో నిలకడ చాలా అవసరం. పదే పదే వాయిదాలు మిస్ అవ్వడం వల్ల మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోలేరు. అందుకే ఎస్‌ఐపీ డేట్ కంటే రెండు మూడు రోజుల ముందే బ్యాంక్ ఖాతాలో తగినంత నగదు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, మీ ఫండ్స్, బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన ఎస్‌ఎమ్‌ఎస్, ఈమెయిల్ అలర్ట్‌లను ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవడం ద్వారా ఇలాంటి పొరపాట్లను నివారించవచ్చు.

