178 బ్లాక్‌లిస్ట్‎లో ట్రైనింగ్ సెంటర్లు

PMKVY : యువతలో నైపుణ్యాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అమలులో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ట్రైనీలు తరగతులకు హాజరు కాకపోవడం, నకిలీ పత్రాలు, అస్సలు ఉనికిలోనే లేని శిక్షణా కేంద్రాల పేరుతో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఈ దుర్వినియోగానికి పాల్పడిన మొత్తం 178 శిక్షణా భాగస్వాములు, శిక్షణా కేంద్రాలను కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బ్లాక్‌లిస్ట్ చేశాయి.

2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా 2025 జూన్ వరకు దేశంలో 1.64 కోట్ల మంది యువతకు శిక్షణ ఇవ్వబడింది. అయితే, 2022లో ప్రారంభించిన నాలుగవ దశ (PMKVY 4.0) నుంచే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ పథకం అమలులో అనేక రకాల మోసాలు జరిగాయి. ట్రైనింగ్ సెంటర్లు నకిలీ బిల్లులను సృష్టించడం, శిక్షణకు విద్యార్థులు హాజరు కాకపోవడం, నకిలీ పత్రాలను తయారు చేయడం, ట్రైనింగ్ పార్టనర్లు లేదా కేంద్రాలు అస్సలు ఉనికిలోనే లేకపోవడం వంటివి ఈ అక్రమాలలో ఉన్నాయి.

ఈ అక్రమాలను గుర్తించిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీవ్ర చర్యలు తీసుకున్నాయి. PMKVY నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 30న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రాంతీయ డైరెక్టరేట్‌లకు లేఖ ద్వారా తెలియజేసింది. ఈ దుర్వినియోగానికి పాల్పడిన మొత్తం 178 మంది శిక్షణా భాగస్వాములు, శిక్షణా కేంద్రాలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు.

బ్లాక్‌లిస్ట్ అయిన శిక్షణా భాగస్వాములు, కేంద్రాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అక్రమాలు అధికంగా జరిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధికంగా 59 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశారు. ఢిల్లీ (25), మధ్యప్రదేశ్ (24), రాజస్థాన్ (20) రాష్ట్రాలలో కూడా అధిక సంఖ్యలో శిక్షణా భాగస్వాములపై, శిక్షణా కేంద్రాలపై వేటు పడింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story