Mobile Scheme 2: దేశంలో స్మార్ట్‌ఫోన్ల తయారీ రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్-2ను ప్రారంభించారు. దేశంలో మొబైల్ ఉత్పత్తులను రెండు రెట్లు పెంచడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ నూతన స్కీమ్ కోసం ఏకంగా రూ.62,500 కోట్లను కేటాయించింది. ఈ పథకం ద్వారా దేశీయంగా మొబైల్ ఫోన్లు, వాటికి సంబంధించిన విడిభాగాలను తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఉత్పత్తిపై 5 శాతం వరకు ప్రోత్సాహకాలను (ఇన్సెంటివ్‌లు) అందించనుంది. కేవలం విదేశీ ఫోన్లను ఇక్కడ అసెంబుల్ చేయడమే కాకుండా, పూర్తి స్థాయిలో భారతీయ డిజైన్‌తో, భారతీయ పరిజ్ఞానంతో మొబైల్స్ తయారు చేసేలా కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

మెమొరీ చిప్‌ల కొరత.. పెరిగిన ధరలు

ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా మెమొరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఆయన వివరించారు. ఈ దిగుమతి భారాన్ని తగ్గించుకోవడానికి దేశీయంగానే మెమొరీ చిప్స్ తయారు చేసే ప్లాంట్లను నెలకొల్పడంపై ప్రభుత్వం వేగంగా దృష్టి సారిస్తోంది. ఒక స్మార్ట్‌ఫోన్ తయారీలో దాదాపు 1,000 వరకు చిన్న చిన్న విడిభాగాలు ఉంటాయి. వీటి తయారీ కోసం దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

చైనాకు గండి.. భారత్‌ వైపు దిగ్గజాల చూపు

గతంలో భారత్ కేవలం ఫోన్ల అసెంబ్లింగ్‌పైనే దృష్టి పెట్టగా, ఇప్పుడు స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు తమ తయారీ యూనిట్లను చైనా నుంచి భారత్‌కు తరలిస్తుండటం మన దేశంలో ఉన్న అనుకూలమైన వాతావరణానికి నిదర్శనం. చైనాకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, వేగవంతమైన వాతావరణం భారత్‌లోనే లభిస్తోందని ప్రపంచ సంస్థలు నమ్ముతున్నాయి. ఈ రకమైన పెట్టుబడులతో రాబోయే రోజుల్లో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొబైల్ తయారీ పథకం రెండవ విడత రాకతో భారత్ ఎలక్ట్రానిక్స్ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది. దేశీయంగానే స్పేర్ పార్ట్స్, చిప్‌ల తయారీ పెరిగితే రాబోయే రోజుల్లో ఫోన్ల ధరలు సామాన్యుడికి మరింత అందుబాటులోకి వస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story