Recharge Plan Hike : మొబైల్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీ జేబుకు చిల్లు పడే రోజులు దగ్గరపడ్డాయి. దేశంలోని దిగ్గజ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్లాన్ల విషయంలో సైలెంట్‌గా ధరలు పెంచేసిన ఈ కంపెనీలు, త్వరలోనే అన్ని ప్లాన్లపై ఒకేసారి భారీ బాదుడుకు ప్లాన్ చేస్తున్నట్లు మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ లాభాలను పెంచుకోవడానికి ప్లాన్లలో చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా వినియోగదారుల పై భారాన్ని వేస్తున్నాయి. ఇటీవల ఎయిర్‌టెల్ తన రూ.859 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.899కి పెంచింది. ఇది పైకి చిన్న మొత్తంగా అనిపించినా, అన్ని ప్లాన్ల విషయంలో ఇలాంటి మార్పులు వస్తే అది నెలకు వందల రూపాయల భారం అవుతుంది. కస్టమర్లకు పెద్దగా తెలియకుండానే కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి.

జియో ప్లాన్లలోనూ భారీ మార్పులు

మరోవైపు జియో కూడా తన పాపులర్ రూ.195 డేటా వోచర్ విషయంలో కీలక మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది, కానీ ఇప్పుడు దానిని కేవలం 30 రోజులకు కుదించింది. అంటే దీనివల్ల రోజువారీ ఖర్చు భారీగా పెరిగింది. పాత లెక్కల ప్రకారం రోజుకు రూ.2.16 ఖర్చయ్యేది, ఇప్పుడు అది రూ.6.50 కి చేరింది. అంటే దాదాపు మూడు రెట్లు భారం పెరిగిందన్నమాట. కేవలం వ్యాలిడిటీ తగ్గించడం ద్వారా జియో తన యూజర్ల జేబుకు చిల్లు పెడుతోంది.

రెండేళ్ల నిరీక్షణకు తెర.. భారీ పెంపునకు ఛాన్స్

సాధారణంగా టెలికాం కంపెనీలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ టారిఫ్ ధరలను సవరిస్తుంటాయి. చివరిసారిగా భారీ స్థాయిలో ధరలు పెరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. దీంతో ఇప్పుడు మరోసారి టారిఫ్ పెంపునకు ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఎయిర్‌టెల్, జియో బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా తన ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే 5G నెట్‌వర్క్ విస్తరణ కోసం ఈ కంపెనీలు భారీగా ఖర్చు చేశాయి, ఆ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి ప్లాన్ల ధరల పెంపు ఒక్కటే మార్గమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎప్పుడు పెరగొచ్చు?

టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. ఈ టారిఫ్ పెంపు ప్రక్రియ ఇప్పటికే అడపాదడపా మొదలైంది. అయితే అన్ని ప్లాన్లపై ఒకేసారి భారీ పెంపు ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తిస్థాయిలో కొత్త ధరలు అమల్లోకి రావచ్చని అంచనా. కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, లాంగ్ టర్మ్ ప్లాన్లతో ముందే రీఛార్జ్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీలు తమ సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమని టెలికాం రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story