రూ.22,516 కోట్ల మైక్రాన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ

India Semiconductor Mission : భారతదేశ సాంకేతిక చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. గుజరాత్‌లోని సాణంద్ వేదికగా మన దేశం సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ దేశాలకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ మైక్రాన్ టెక్నాలజీకి చెందిన అత్యాధునిక ATMP (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్) ప్లాంట్‌ను ప్రారంభించారు. దాదాపు రూ.22,516 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ ప్రాజెక్ట్, భారత్‌ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చే దిశలో అతిపెద్ద అడుగు. ఇకపై మన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వాడే చిప్స్ మేడ్ ఇన్ ఇండియా ముద్రతో ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనున్నాయి.

ఈ ప్లాంట్ ద్వారా సామాన్యులకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఉపాధి. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 2,000 మంది పనిచేస్తుండగా, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 5,000కి పెరగనుంది. ఇంజనీర్లు, టెక్నీషియన్లతో పాటు ఆపరేటర్లకు ఇక్కడ భారీగా అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ ప్లాంట్ లోని మానవీయ కోణం ఏంటంటే.. ఇక్కడ దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు దివ్యాంగులు ఇక్కడ ఆపరేటర్లుగా, టెక్నీషియన్లుగా రాణిస్తుండటం విశేషం. దీనివల్ల సామాజికంగా కూడా ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టింది.

సాణంద్‌లోని ఈ ప్లాంట్ మొబైల్స్, కంప్యూటర్లలో అత్యంత కీలకమైన DRAM, NAND మెమరీ ప్రొడక్టులతో పాటు SSD స్టోరేజ్ డివైజ్‌లను ప్యాకేజింగ్ చేస్తారు. మైక్రాన్ సంస్థకు విదేశాల్లో ఉన్న ఫ్యాక్టరీల నుంచి వేఫర్లను ఇక్కడికి తీసుకొచ్చి, వాటిని పూర్తిస్థాయి మెమరీ చిప్స్‌గా మారుస్తారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి వేగవంతమైన మెమరీ చాలా అవసరం. మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా చెప్పినట్లుగా, ఈ ప్లాంట్ భవిష్యత్తు టెక్నాలజీ అవసరాలను తీర్చడంలో కీలకం కానుంది.

ఈ ఒక్క ప్లాంట్ రాకతో సాణంద్ ప్రాంతం మొత్తం ఒక సెమీకండక్టర్ హబ్ గా మారిపోనుంది. దీని చుట్టూ రవాణా, గృహ నిర్మాణం, చిన్న తరహా విడిభాగాల సరఫరాదారులు, మెయింటెనెన్స్ సర్వీసులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అంటే పరోక్షంగా వేలమందికి జీవనోపాధి లభిస్తుంది. భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంతంగా చిప్ ప్యాకేజింగ్ చేసుకోవడం వల్ల ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడమే కాకుండా, సరఫరా గొలుసు మరింత బలోపేతం అవుతుంది. మొత్తానికి సాణంద్ ప్లాంట్ భారత్ పారిశ్రామిక ప్రగతికి కొత్త వేగాన్ని ఇచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story