అసలైన సంపద అంటే ఏంటో చెప్పిన ఎలోన్ మస్క్

Elon Musk : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ ఆర్థిక వ్యవస్థ గురించి తనదైన శైలిలో విశ్లేషించారు. చాలామంది డబ్బునే ఆర్థిక వ్యవస్థ అనుకుంటారని, కానీ అది కేవలం లావాదేవీలను రికార్డ్ చేసే ఒక డేటాబేస్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రమ, వస్తువులు, సేవలు కలిస్తేనే అసలైన ఆర్థిక వ్యవస్థ తయారవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం డబ్బు ఉండటం వల్ల ప్రయోజనం లేదని, ఆ డబ్బుతో కొనుగోలు చేయడానికి అవసరమైన వస్తువులు మార్కెట్లో ఉండాలని ఆయన గుర్తు చేశారు.

మస్క్ ఈ విషయాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరించారు. "ఒక మనిషి ఒక నిర్జన ద్వీపంలో చిక్కుకున్నాడు అనుకుందాం. అతని దగ్గర స్విస్ బ్యాంక్ అకౌంట్‌లో ట్రిలియన్ డాలర్లు ఉన్నా, లేదా ప్రపంచంలో ఉన్న బిట్‌కాయిన్ అంతా అతని దగ్గరే ఉన్నా.. అక్కడ అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఆ సమయంలో ఆ కోట్లు ఇచ్చినా కూడా ఒక సూప్ డబ్బా దొరకదు. అక్కడ ఆ సూప్ డబ్బానే అత్యంత విలువైనది" అని మస్క్ చెప్పుకొచ్చారు. అంటే సంపద అనేది వస్తువుల రూపంలో ఉండాలి తప్ప, కేవలం అంకెల్లో కాదని ఆయన ఉద్దేశం.

ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం శ్రమ అని మస్క్ నమ్ముతారు. ఏ వస్తువు తయారవ్వాలన్నా మనిషి శ్రమ అవసరం. అయితే, రాబోయే 10 నుంచి 20 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వల్ల ఈ శ్రమ అవసరం తగ్గిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో బిలియన్ల కొద్దీ రోబోలు అందుబాటులోకి వస్తాయని, అవి దాదాపు ఉచితంగా సేవలు, వస్తువులను అందిస్తాయని మస్క్ పేర్కొన్నారు. దీనివల్ల మనుషులు రిటైర్మెంట్ కోసం డబ్బు దాచుకోవాల్సిన అవసరం ఉండదని, ఆరోగ్యం, ఇల్లు వంటి అవసరాలన్నీ సులభంగా తీరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

2025 అక్టోబర్‌లో మస్క్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. భవిష్యత్తులో ఉద్యోగం చేయడం అనేది ఒక ఐచ్ఛికం మాత్రమే అవుతుంది. అంటే మనిషికి ఇష్టమైతే పని చేయవచ్చు, లేదంటే లేదు. రోబోలే అన్ని పనులను చక్కబెడతాయి కాబట్టి, మనుషులు కళలు, క్రీడలు లేదా తమకు నచ్చిన వ్యాపకాల్లో సమయం గడపవచ్చు. అప్పుడు డబ్బుకు విలువ ఉండదని, కేవలం అరుదైన వస్తువులకే (ఉదాహరణకు ఒరిజినల్ పెయింటింగ్స్) గుర్తింపు ఉంటుందని మస్క్ అంచనా వేస్తున్నారు. మస్క్ చెప్పే ఈ విషయాలు వినడానికి వింతగా ఉన్నా, టెక్నాలజీ వెళ్తున్న వేగం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story