RBI: మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్యాంక్ ఖాతా నుంచి ఉన్నట్లుండి డబ్బులు కట్ అయ్యాయా? కస్టమర్ కేర్‌కు కాల్ చేసి విసిగిపోతున్నారా? కంగారు పడాల్సిన పనిలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్ల రక్షణ కోసం తీసుకొచ్చిన కొన్ని ప్రత్యేక నిబంధనలతో మీ కష్టార్జితాన్ని పూర్తిగా వెనక్కి రప్పించుకోవచ్చు. మీ ప్రమేయం లేకుండా లేదా అనవసరమైన కారణాలతో అకౌంట్ నుంచి సొమ్ము కట్ అయినట్లు మెసేజ్ రాగానే అస్సలు ఆలస్యం చేయకూడదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్ నుంచి అలర్ట్ వచ్చిన మూడు వర్కింగ్ డేస్ లోపు మీరు సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే ఖాతాదారుడిపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. స్టేట్‌మెంట్ వచ్చే వరకు వేచి చూడకుండా వెంటనే మొబైల్ యాప్, ఈమెయిల్ లేదా నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. ఇలా ఫిర్యాదు చేసిన పది పనిదినాల్లో సదరు వివాదాస్పద సొమ్మును బ్యాంక్ తాత్కాలికంగా మీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.

అనవసర రుసుములకు ఆధారాలు అడగండి

కొన్నిసార్లు సైబర్ మోసాలు కాకుండా బ్యాంకులు తమ సొంత నిబంధనల పేరుతో నిలదీయకుండానే ఖాతాల నుంచి సర్వీస్ ఛార్జీలు, హిడెన్ ఫీజులు కోసేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో సైలెంట్‌గా ఉండిపోకుండా బ్యాంక్ రేట్ చార్ట్ కాపీని, సరైన ఆధారాలను చూపించాలని గట్టిగా నిలదీయాలి. మీ వద్ద ఉన్న బ్యాంక్ స్టేట్‌మెంట్లు, కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడిన సమాచారం, ఈమెయిల్ కాపీలను భద్రంగా దాచుకోవాలి. ఈ పక్కా ఆధారాలే మీ డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తాయి.

ఉచితంగా సమస్య సాల్వ్ చేసే ఆర్బీఐ లోక్‌పాల్

మీరు ఫిర్యాదు చేసిన ముప్పై రోజుల్లోగా బ్యాంక్ ఎలాంటి సరైన సమాధానం ఇవ్వకపోయినా, మీ సమస్యను పరిష్కరించకపోయినా తదుపరి చర్యలకు సిద్ధమవ్వాలి. రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ లోక్‌పాల్ స్కీమ్ కింద నేరుగా కేంద్ర బ్యాంకుకు కంప్లైంట్ చేయవచ్చు. ఆర్బీఐకి చెందిన 'కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' (CMS) పోర్టల్ ద్వారా బాధితులు ఎవరైనా ఉచితంగా తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా 14448 అనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి కూడా తగిన మార్గదర్శకత్వం పొందవచ్చు.

అకౌంట్‌పై నిరంతరం నిఘా ఉంచడం శ్రేయస్కరం

కేవలం ఒకసారి ఫిర్యాదు చేసి ఊరుకుంటే సరిపోదు. అకౌంట్‌లో మళ్లీ ఇలాంటి అనధికారిక కోతలు పడకుండా నిరంతరం మీ ట్రాన్సాక్షన్లను గమనిస్తుండాలి. ప్రతి చిన్న లావాదేవీకి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అలర్ట్లు వచ్చేలా సెట్ చేసుకోవడం చాలా మేలు. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే చొరవ తీసుకుని నిలదీస్తేనే మీ సొమ్ము సురక్షితంగా ఉంటుంది.

Next Story