SIP: రిటైర్‌మెంట్ నాటికి చేతిలో కోటి రూపాయల నిధి ఉండాలనేది ప్రతీ ఒక్కరి కల. వయస్సు 50 ఏళ్లకు చేరుకునే సరికే రూ. 1 కోటి భారీ కార్పస్ సిద్ధం చేసుకోవడం సరైన ఆర్థిక ప్రణాళికతో చాలా సులభం. మ్యూచువల్ ఫండ్ SIP విధానం ద్వారా ఏ వయసు వారు ఎంత పొదుపు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎంత త్వరగా మొదలుపెడితే అంత లాభం

ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో చక్రవడ్డీ లేదా కాంపౌండింగ్ శక్తి అద్భుతాలు చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు సాధించవచ్చు. చారిత్రక డేటాను పరిశీలిస్తే ఈక్విటీ ఫండ్లు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని సగటున ఏడాదికి 12 శాతం వరకు రాబడిని అందించాయి. 50 ఏళ్ల నాటికి రూ.కోటి సంపాదించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత త్వరగా పెట్టుబడులు ప్రారంభిస్తే, నెలవారీ కట్టాల్సిన మొత్తం అంత తక్కువగా ఉంటుంది.

30 ఏళ్ల వయసులో ప్రారంభించే వారికి తక్కువ భారం

మీరు ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ఉండి 50 ఏళ్ల నాటికి కోటి రూపాయలు జమ చేయాలనుకుంటే మీ చేతిలో నిండుగా 20 ఏళ్ల సమయం ఉంది. వార్షిక రాబడిని 12 శాతంగా అంచనా వేస్తే, మీరు నెలకు కేవలం రూ.10,875 ఎస్‌ఐపీ చేస్తే సరిపోతుంది. 20 ఏళ్ల సుదీర్ఘ కాలం ఉండటం వల్ల చక్రవడ్డీ ప్రభావం వల్ల మీ చిన్న మొత్తమే కాలక్రమేణా కొండంత నిధిగా మారుతుంది.

ఆలస్యం జరిగే కొద్దీ పెరిగే నెలవారీ కడితే భారం

ఒకవేళ మీరు 35 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభిస్తే, మీ చేతిలో 15 ఏళ్లు మాత్రమే ఉంటాయి. కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలకు సుమారు రూ.21,020 కట్టాల్సి వస్తుంది. అంటే 30 ఏళ్ల వయసుతో పోలిస్తే ఏకంగా 93 శాతం ఎక్కువగా చెల్లించాలి. అదే మీరు 40 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచి చూస్తే, కేవలం 10 ఏళ్ల వ్యవధి మాత్రమే మిగులుతుంది. ఈ పదేళ్లలో కోటి మార్కును చేరుకోవడానికి ఏకంగా ప్రతీ నెలా రూ.46,640 చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.

స్టెప్-అప్ ఎస్‌ఐపీతో సులువైన ప్రణాళిక

ప్రారంభంలోనే రూ.20 వేలు లేదా రూ.40 వేలు కట్టడం కష్టంగా అనిపిస్తే, 'స్టెప్-అప్ ఎస్‌ఐపీ' అద్భుతమైన మార్గంగా నిలుస్తుంది. ఏటా వచ్చే జీతం పెంపును బట్టి మీ ఎస్‌ఐపీ మొత్తాన్ని ఒక 5 శాతం పెంచుకుంటూ పోతే ప్రారంభ కనీస చెల్లింపు తగ్గుతుంది. 30 ఏళ్ల వయసు వారు ప్రారంభంలో రూ. 10,875కి బదులుగా కేవలం రూ.7,850తో మొదలుపెట్టవచ్చు. 35 ఏళ్ల వయసు వారు రూ. 16,160 నుంచి, 40 ఏళ్ల వారు రూ. 37,130 చొప్పున ప్రారంభించి ఏటా 5 శాతం పొదుపు పెంచుకుంటూ పోయినా సునాయాసంగా రూ.కోటి చేతికందుతుంది.

Next Story