Credit Cards : లక్షల్లో ఫీజులు.. ప్రైవేట్ జెట్ ప్రయాణాలు.. భారత్‌లో అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డులివే
భారత్‌లో అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డులివే

Credit Cards : భారతదేశంలో క్రెడిట్ కార్డుల మార్కెట్ చాలా వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు కేవలం షాపింగ్ చేయడానికో లేదా వస్తువులను నెలవారీ వాయిదాల పద్ధతిలో కొనుక్కోవడానికో వాడే క్రెడిట్ కార్డులు, ఇప్పుడు సంపన్నుల విలాసవంతమైన జీవనశైలికి ప్రతీకగా మారుతున్నాయి. లక్షల రూపాయల వార్షిక ఫీజులు ఉండే సూపర్-ప్రీమియం క్రెడిట్ కార్డులు తమ కస్టమర్లకు అంతర్జాతీయ అవార్డుల ప్రదర్శనలకు వీఐపీ ఎంట్రీలు, ప్రైవేట్ జెట్ బుకింగ్స్‌పై భారీ తగ్గింపులు మరియు విమానాశ్రయాలలో ప్రత్యేక సేవలను అందిస్తూ రాజభోగం కల్పిస్తున్నాయి.
దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఇప్పుడు శరవేగంగా పెరుగుతున్న అత్యంత సంపన్నులు, పెద్ద వ్యాపారవేత్తలు, గ్లోబల్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడే ఖాతాదారులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ సూపర్-ప్రీమియం కార్డుల ముఖ్య ఉద్దేశం కేవలం డబ్బులు ఖర్చు పెట్టించడం మాత్రమే కాదు, సామాన్యులకు దక్కని ఒక ప్రత్యేకమైన లగ్జరీ అనుభూతిని అందించడం. తరచూ విదేశాల్లో విమాన ప్రయాణాలు చేసేవారికి, లగ్జరీ హోటళ్లలో బస చేసేవారికి, గోల్ఫ్ క్రీడను ఇష్టపడే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. విశేషం ఏమిటంటే.. ఈ కార్డులు అందరికీ లభించవు, కేవలం బ్యాంక్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఇస్తారు.
యాక్సిస్ ప్రిమస్ కార్డ్
దేశంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డుల జాబితాలో యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ప్రిమస్ కార్డ్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ కార్డును సొంతం చేసుకోవడానికి జాయినింగ్ ఫీజు కింద ఏకంగా రూ.5 లక్షలు చెల్లించాలి. అలాగే దీని వార్షిక ఫీజు రూ.3 లక్షలకు పైగానే ఉంటుంది. ఈ కార్డు ఉన్నవారికి బిజినెస్, ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లను బుక్ చేసినప్పుడు వారితో పాటు ప్రయాణించే భాగస్వామికి ఉచితంగా ఎయిర్ టికెట్ లభిస్తుంది. దీనితో పాటు అంతర్జాతీయ గోల్ఫ్ క్లబ్‌లకు ఉచిత ప్రవేశం, విదేశీ కరెన్సీ మార్పిడిపై సున్నా ఛార్జీలు, వ్యక్తిగత సహాయక సేవలు వంటి ఎన్నో రాయల్ బెనిఫిట్స్ ఉంటాయి.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, విదేశీ ఈవెంట్స్ వీఐపీ యాక్సెస్ కోసం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం కార్డ్ చాలా ప్రసిద్ధి చెందింది. దీని వార్షిక ఫీజు దాదాపు రూ.66,000 వరకు ఉంటుంది. ఈ కార్డు ద్వారా అంతర్జాతీయంగా జరిగే ప్రఖ్యాత గ్రామీ అవార్డ్స్ వంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు ముందే టికెట్లను బుక్ చేసుకునే వీఐపీ సదుపాయం లభిస్తుంది. అలాగే ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ వీక్స్, అంతర్జాతీయ మ్యూజిక్ కాన్సెర్టులలో ప్రత్యేక సీట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రీమియం లగ్జరీ హోటళ్లలో ఉచిత అప్‌గ్రేడ్ సేవలు ఈ కార్డు సొంతం.
హెచ్ఎస్‌బీసీ తాజ్ కార్డ్
లగ్జరీ హోటళ్లలో బస చేయడాన్ని ఇష్టపడే వారి కోసం హెచ్ఎస్‌బీసీ తాజ్ క్రెడిట్ కార్డ్ ఒక అద్భుతమైన ఆప్షన్. ప్రసిద్ధ తాజ్ గ్రూప్ హోటళ్లతో భాగస్వామ్యం ఉన్నందున, ఈ కార్డు ఉన్నవారికి హోటల్ గదుల బుకింగ్స్, లగ్జరీ డైనింగ్, ప్రత్యేకమైన ఆతిథ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్కువగా వ్యాపార పనుల మీద లగ్జరీ ట్రావెల్ చేసే వారికి ఈ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
యాక్సిస్ బర్గండీ ప్రైవేట్
యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ కస్టమర్ల కోసం ఈ బర్గండీ ప్రైవేట్ క్రెడిట్ కార్డును డిజైన్ చేశారు. దీని వార్షిక ఫీజు రూ.50,000గా ఉంటుంది. అయితే సదరు బ్యాంకులో బర్గండీ ప్రైవేట్ అకౌంట్ కలిగి ఉన్నవారికి దీనిని ఉచితంగానే అందిస్తారు. ఈ కార్డు ద్వారా ప్రపంచవ్యాప్తంగా అపరిమిత విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, క్లబ్ మారియట్ మరియు అకార్ ప్లస్ హోటల్ మెంబర్‌షిప్‌లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో చేసే ఖర్చులపై అంతర్జాతీయ కరెన్సీ మార్పిడి రుసుములు పూర్తిగా మినహాయిస్తారు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, యాక్సిస్ రిజర్వ్ కార్డులు
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ మరియు యాక్సిస్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్ వంటి మోడళ్లు కూడా విదేశీ ప్రయాణాలు, లైఫ్‌స్టైల్ సదుపాయాలకు పెద్దపీట వేస్తాయి. వీటిలో అపరిమిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, విమానాశ్రయాలలో ఉచిత స్పా సేవలు, ఉచిత గోల్ఫ్ రౌండ్లు, ప్రీమియం హోటల్ మెంబర్‌షిప్‌లు లభిస్తాయి. విదేశాల్లో ఖర్చు చేసే ప్రతి రూపాయికి అదనపు రివార్డ్ పాయింట్లు మరియు తక్కువ కరెన్సీ మార్పిడి ఛార్జీల ద్వారా ఇవి ధనవంతులను ఆకర్షిస్తున్నాయి.
యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్
విలాసవంతమైన విమాన ప్రయాణ అనుభూతుల కోసం యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఈ కార్డు ఉన్నవారికి విమానాశ్రయ రన్‌వే నుండి నేరుగా విమానం వరకు ప్రత్యేక లగ్జరీ కారులో తీసుకెళ్లే టార్మాక్ ట్రాన్స్ఫర్ సదుపాయం కల్పిస్తారు. అంతేకాకుండా ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ బుకింగ్స్‌పై ఏకంగా 1000 డాలర్ల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. లగ్జరీ హోటళ్లలో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్, ఉచిత గదుల అప్‌గ్రేడ్స్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఫీజులకు తగ్గ ప్రయోజనాలు లభిస్తాయా?
ఈ కార్డులకు ఉండే భారీ ఫీజుల దృష్ట్యా, ఇవి కేవలం సమాజంలో హోదాను చూపించే వస్తువులుగా మాత్రమే మిగిలిపోకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని రాయల్ ఫీచర్లను, అనగా ఉచిత విమాన ప్రయాణాలు, హోటల్ బస, గోల్ఫ్ సేవలను నిరంతరం ఉపయోగించుకునే వారికి మాత్రమే ఈ కార్డుల వల్ల పూర్తి లాభం చేకూరుతుంది. కొన్ని కార్డులలో ఆఫర్లు పొందడానికి ఏడాదికి లక్షల రూపాయలు ఖర్చు చేయాలనే నిబంధనలు ఉంటాయి. కాబట్టి సాధారణ లేదా మధ్యతరగతి వినియోగదారులకు ఇవి లాభాల కంటే ఆర్థిక భారంగానే మారే ప్రమాదం ఉంది.

