Mukesh Ambani : ముఖేష్ అంబానీ మ్యాజిక్..పండుగ చేసుకుంటున్న 44 లక్షల మంది ఇన్వెస్టర్లు
పండుగ చేసుకుంటున్న 44 లక్షల మంది ఇన్వెస్టర్లు

Mukesh Ambani : దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024లో మార్కెట్ క్యాప్ పరంగా కొంత నెమ్మదించినా 2025లో మాత్రం దూకుడు చూపించింది. కోవిడ్ సంవత్సరం తర్వాత 2025లో రిలయన్స్ షేర్లు అత్యధికంగా పెరిగాయి. గత 11 నెలల్లో రిలయన్స్ షేర్లలో 26 శాతం కంటే ఎక్కువ వృద్ధి కనిపించింది. దీని ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.4.4 లక్షల కోట్లు పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మొత్తం విలువ రూ.21 లక్షల కోట్ల దగ్గర ఉంది. శుక్రవారం నాడు కంపెనీ షేర్ రూ.1,557.95 తో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణాలు ఏమిటో చూద్దాం.
రిలయన్స్ షేర్ల పెరుగుదలకు ప్రధాన కారణాలలో ఒకటి జియో ఐపీఓ గురించి వస్తున్న అంచనాలు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్.. రిలయన్స్ జియో విలువను ఏకంగా $180 బిలియన్లుగా అంచనా వేసింది. పెరిగిన మొబైల్ టారిఫ్‌లు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారంలో పెరుగుదల, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ విస్తరణ కారణంగా FY26-28 మధ్య జియో ఆదాయం, ఎబిట్డా (EBITDA)లో 18% నుంచి 21% వరకు వృద్ధిని సాధించగలదని జెఫరీస్ భావిస్తోంది.
మార్కెట్ నిపుణుడు సుదీప్ బందోపాధ్యాయ ప్రకారం.. వచ్చే త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ARPU పెరుగుదల లాభం కంపెనీకి పూర్తిగా దక్కనుంది. అదనంగా జియో టెలికాం వ్యాపారాన్ని ప్రత్యేకంగా లిస్టింగ్ చేయడం ద్వారా వాల్యూ అన్‌లాకింగ్ ప్రక్రియ వచ్చే ఏడాది మొదటి భాగంలో జరుగుతుందని ఏజీఎంలో ప్రకటించారు. ఈ ప్రకటన కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచుతోంది.
చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్న ఆయిల్-టు-కెమికల్ వ్యాపారం ఇప్పుడు బలంగా తిరిగి పుంజుకుంటోంది. ఈ రంగానికి తిరిగి ఊపు రావడానికి ముఖ్యంగా కొన్ని అంశాలు దోహదపడుతున్నాయి.. బలమైన మౌలిక సదుపాయాలు, రిఫైనరీ నిర్వహణ, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆసియా రిఫైనింగ్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. డీజిల్, జెట్ ఇంధనం, గ్యాసోలిన్ వంటి ఇంధనాల స్ప్రెడ్‌లు బలంగా ఉన్నాయి. యుబిఎస్ అనే బ్రోకరేజ్ సంస్థ, రిలయన్స్ O2C వ్యాపారం నుంచి ఆదాయం పెరుగుతుందని అంచనా వేసింది. O2C EBITDA FY26 రెండో భాగంలో రూ.340 బిలియన్లకు, FY27 లో రూ.648 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తూ, రూ.1,820 టార్గెట్ ధరతో కొనొచ్చని రేటింగ్ ఇచ్చింది.
టెలికాం, O2C విభాగాల అద్భుతమైన పనితీరు కారణంగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ షేర్లకు సానుకూల రేటింగ్‌లు ఇస్తున్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ సంస్థ రిలయన్స్‌కు రూ.1,735 టార్గెట్ ధరతో కొనొచ్చంటూ రేటింగ్ ఇచ్చింది. FY26-28 మధ్య కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ EPS CAGR 15% సాధించవచ్చని అంచనా వేసింది. ఈ సంస్థ టెలికాం బిజినెస్ మెరుగైన వృద్ధి దృష్ట్యా జియో EV/EBITDA మల్టిపుల్‌ను 15 రెట్లు పెంచింది (భారతీ ఎయిర్‌టెల్ కంటే 10% ఎక్కువ).

