క్రెడిట్ కార్డులు వాడితే కలిగే లాభాలు, నష్టాలు ఇవే

Credit Cards : ఈ రోజుల్లో ఒకరు క్రెడిట్ కార్డును వాడటం మొదలుపెడితే, కొంతకాలానికే ఇతర బ్యాంకులు కూడా వారికి క్రెడిట్ కార్డులు ఇస్తామని క్యూ కడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఇప్పటికే ఒక కార్డు ఉంది కదా, ఇంకొకటి ఎందుకు అని చాలామంది ఆలోచిస్తారు. అయితే, ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం మంచిదేనా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం సాధారణంగా కాదనే చెప్పవచ్చు. కానీ, ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం కొన్ని సందర్భాల్లో చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇది ఎప్పుడు లాభం, ఎప్పుడు నష్టం అనేది వివరంగా తెలుసుకుందాం.

ఇటీవల క్రెడిట్ కార్డును తీసుకుని, భవిష్యత్తులో కార్ లోన్, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించడం చాలా ముఖ్యం. క్రెడిట్ హిస్టరీ అనేది మీరు సమయానికి బిల్లులు చెల్లిస్తే, క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించినప్పుడు ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే ఎక్కువ లావాదేవీలు చేసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల మీ క్రెడిట్ రిపోర్ట్ మరింత బలంగా తయారవుతుంది.

మీ దగ్గర రూ.2 లక్షల క్రెడిట్ లిమిట్ ఉన్న ఒక కార్డు ఉందని అనుకుందాం. ఇప్పుడు మీరు అదే లిమిట్ ఉన్న మరొక కార్డు తీసుకుంటే, మీ మొత్తం క్రెడిట్ లిమిట్ రూ.4 లక్షలు అవుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ ఖర్చు చేయడానికి అవకాశం లభిస్తుంది. అలాగే, అత్యవసర సమయాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

క్రెడిట్ స్కోర్‌లో కీలకమైన అంశం క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో(CUR). సులభంగా చెప్పాలంటే, మీ మొత్తం క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎంత వాడుకుంటున్నారో ఇది తెలుపుతుంది.

ఉదాహరణకు, మీ లిమిట్ రూ.2 లక్షలు అయితే, మీరు రూ.1.6 లక్షలు ఖర్చు చేస్తే, మీ CUR 80% అవుతుంది. ఇది చాలా ఎక్కువ. నిజానికి, ఈ నిష్పత్తి 30% కంటే తక్కువగా ఉండాలి. ఇలాంటి సందర్భంలో, మీ దగ్గర రెండో కార్డు ఉంటే, మీ ఖర్చును రెండు కార్డుల్లో పంచుకోవచ్చు. దీనివల్ల మీ CUR తక్కువగా ఉంటుంది, క్రెడిట్ స్కోర్ కూడా మెరుగవుతుంది.

కొంతమంది క్రెడిట్ కార్డులను చాలా తక్కువగా ఉపయోగిస్తారు, ఉదాహరణకు హోటల్ బుకింగ్‌లకు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. అలాంటి వారికి రెండో కార్డు తీసుకోవడం తలనొప్పిగా మారవచ్చు, ఎందుకంటే ప్రతి కార్డుకు సమయానికి బిల్లు చెల్లించడం, ట్రాక్ చేయడం ముఖ్యం. అంతేకాకుండా, మీరు ఇప్పటికే ఉన్న కార్డును తెలివిగా ఉపయోగిస్తూ, మీ ఖర్చు మొత్తం లిమిట్‌లో 30% కంటే తక్కువగా ఉంటే, రెండో కార్డు తీసుకోవడం అనవసరమైన భారాన్ని పెంచుతుంది. ఇలాంటి సందర్భంలో క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి రెండో కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story