Tata Group: ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా..ఒక్క నిర్ణయంతో రూ.68000 కోట్లు ఆవిరి
ఒక్క నిర్ణయంతో రూ.68000 కోట్లు ఆవిరి

Tata Group:దశాబ్దాలుగా టాటా గ్రూప్‌కు మూలస్తంభంగా వ్యవహరిస్తున్న ఎన్ చంద్రశేఖరన్ తన రాజీనామాను ప్రకటించడం దేశీయ ఆర్థిక రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 2027 ఫిబ్రవరి 20తో తన ప్రస్తుత పదవీ కాలం ముగియనుండగా, తాను మళ్లీ ఛైర్మన్ పదవిని చేపట్టే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల భయాల నడుమ వెలువడిన ఈ ప్రకటన ఇన్వెస్టర్లలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ఒక్కసారిగా భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి పెరిగి టాటా గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ ఊహించని రీతిలో పడిపోయింది.
టిసిఎస్ సహా కీలక కంపెనీల షేర్లు విలవిల
చంద్రశేఖరన్ నిర్ణయం ప్రభావం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పై అత్యంత తీవ్రంగా పడింది. టిసిఎస్ షేరు ఇంట్రాడేలో ఏకంగా 5 శాతానికి పైగా పడిపోయి, ఆఖరుకు 3.93 శాతం నష్టంతో రూ.2,349.70 వద్ద ముగిసింది. టైటాన్ కంపెనీ 0.57 శాతం, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 1.5 శాతం పడిపోయాయి. టాటా స్టీల్ 1.09 శాతం, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీస్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. ట్రెంట్, టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్ వంటి ఇతర కంపెనీలు సైతం నష్టాల బాట పట్టడంతో ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైంది.
రాజీనామా వెనుక అసలు కథ ఇదేనా?
1987లో టాటా గ్రూప్‌లో ఒక సాధారణ ఉద్యోగిగా చేరిన చంద్రశేఖరన్, 2009లో టీసీఎస్ సిఈఓగా, 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎదిగారు. ఆగస్టు 18న జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అంతర్గత విభేదాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడం వల్లనే చంద్రశేఖరన్ పునర్‌నియామకాన్ని బోర్డు వాయిదా వేస్తూ వస్తోందని తెలుస్తోంది.
మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?
ఛైర్మన్ వంటి కీలక నాయకుడు దూరమవుతున్న వేళ మార్కెట్ ఇలా తీవ్రంగా స్పందించడం సహజమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే నూతన ఛైర్మన్ పేరును బోర్డు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ అస్థిరత తొలగిపోయి, కంపెనీలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.

