Ghee Price Hike : సామాన్యుడికి మళ్లీ దెబ్బ.. పండుగ సీజన్‌లో భారీగా పెరిగిన నెయ్యి ధర
పండుగ సీజన్‌లో భారీగా పెరిగిన నెయ్యి ధర

Ghee Price Hike : నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించి సామాన్య ప్రజలకు కొంత ఊరట కలిగించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు అమలులోకి వచ్చిన నెలన్నర కాకముందే, ఆ ఉపశమనం ఇప్పుడు భారంగా మారింది. ఈసారి దెబ్బ డైరీ ఉత్పత్తుల నుంచి తగిలింది. కర్ణాటకకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన డైరీ బ్రాండ్ నందిని నెయ్యి ధరలను భారీగా పెంచింది. జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు రూ.30 లభించిన ఉపశమనాన్ని పూర్తిగా తుడిచిపెడుతూ, కంపెనీ ఏకంగా రూ.90 పెంచింది. పెరిగిన అంతర్జాతీయ మార్కెట్ ధరలే ఈ నిర్ణయానికి కారణమని కంపెనీ పేర్కొంది.
సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 22 నుండి కొత్త, తగ్గిన జీఎస్టీ రేట్లను అమలు చేసింది. దీని ప్రభావం నందిని నెయ్యిపై కూడా పడింది. జీఎస్టీ తగ్గింపుకు ముందు, నందిని నెయ్యి ధర లీటరుకు రూ.640 ఉండేది. కొత్త రేట్లు అమలు కాగానే, వినియోగదారులకు రూ.30 తగ్గింపు లభించి, నెయ్యి ధర రూ.610కి చేరుకుంది. పండుగల సీజన్‌లో ఇది గొప్ప ఉపశమనంగా భావించారు.
అయితే, ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. తాజాగా, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఒకేసారి ఏకంగా లీటరుపై రూ.90 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రూ.610కి లభించిన నెయ్యి ప్యాకెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ.700కి చేరుకుంది. జీఎస్టీ ద్వారా వచ్చిన రూ.30 లాభం పోవడమే కాకుండా, అదనంగా రూ.90 భారం పడింది.
నందిని బ్రాండ్‌ను నిర్వహిస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు, ఈ ధరల పెరుగుదలను సమర్థించుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న వ్యయం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రపంచ స్థాయిలో నెయ్యికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పేర్కొంది. ఈ ప్రపంచ మార్కెట్ పోకడలకు అనుగుణంగా తమ సంస్థ ఆర్థిక స్థిరత్వం కాపాడుకోవడానికి ఈ పెరుగుదల అవసరమని మహాసంఘం తెలిపింది. అయినప్పటికీ, ధర పెంచినా కూడా తమ నందిని నెయ్యి ధరలు మార్కెట్‌లో అత్యంత తక్కువ ధరలలోనే ఉన్నాయని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రకటించింది.
నందిని ధర పెంచిన నేపథ్యంలో, మార్కెట్‌లోని ఇతర ప్రధాన డైరీ బ్రాండ్‌ల ధరలను గమనించడం అవసరం. జీఎస్టీ తగ్గింపు తర్వాత అమూల్ నెయ్యి ధర కూడా సుమారు రూ.610కి తగ్గింది (గతంలో రూ.650). సరస్ నెయ్యి ధర అక్టోబర్‌లో రూ.30 పెరిగింది. ప్రస్తుతం ఇది లీటరుకు రూ.581 వద్ద అమ్ముడవుతోంది. పతంజలి సాధారణ నెయ్యి ధర రిటైల్ మార్కెట్‌లో లీటరుకు రూ.650 నుండి రూ.700 మధ్య అందుబాటులో ఉంది. మదర్ డైరీ నెయ్యి ధర లీటరుకు రూ.641గా ఉంది.

