Indian Currency : మీరు నేపాల్ పర్యటనకు వెళ్లాలని లేదా వ్యాపార నిమిత్తం నేపాల్‌తో లావాదేవీలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో అద్భుతమైన శుభవార్త. భారతీయ, నేపాల్ పౌరులు తమ వెంట 25,000 రూపాయల వరకు భారతీయ కరెన్సీని తీసుకెళ్లడానికి, నేపాల్‌కు తీసుకురావడానికి నేపాల్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. అయితే ఈ సదుపాయం కేవలం 2016 నవంబర్ 9వ తేదీన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 200, రూ. 500 కొత్త నోట్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అధికారిక ప్రకటన

నేపాల్‌లోని కేంద్ర బ్యాంక్ అయిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఈ మేరకు ఒక స్పష్టమైన నోటీసును విడుదల చేసింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం.. ఏ భారతీయ లేదా నేపాల్ పౌరుడైనా సరే గరిష్టంగా రూ.25,000 వరకు విలువైన 200, 500 రూపాయల నోట్లను భారతదేశం నుంచి నేపాల్‌కి కానీ లేదా నేపాల్ నుంచి భారత్‌కి కానీ తమ వద్ద ఉంచుకుని ప్రయాణించవచ్చు. ఈ నియమానికి సంబంధించిన గెజిట్‌ను గతంలోనే ప్రచురించినప్పటికీ, పౌరులలో ఉన్న సందేహాలను నివృత్తి చేసి పూర్తి స్పష్టత ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ మరోసారి నోటీసు జారీ చేసింది.

పాత నోట్లపై నిషేధం యథాతథం

ప్రస్తుత విదేశీ మారకద్రవ్య చట్టాల ప్రకారం ఈ సడలింపులను అమలు చేస్తున్నారు. అయితే, 2016 నవంబర్ 8కి ముందు జారీ చేసిన పాత 500 రూపాయలు, 1,000 రూపాయల నోట్లపై ఉన్న నిషేధం నేపాల్‌లో ఇప్పటికీ యథాతథంగా కొనసాగుతోంది. ఆ పాత నోట్లను నేపాల్‌లోకి తీసుకురావడం లేదా అక్కడ మార్పిడి చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ మాట్లాడుతూ.. నేపాల్ పౌరులు భారతీయ కరెన్సీని కేవలం భారతదేశం నుంచి మాత్రమే నేపాల్‌కి తీసుకురాగలరు కానీ, వేరే ఏ మూడో దేశం నుంచి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. అలాగే నేపాల్ నుంచి ఇతర విదేశాలకు భారత రూపాయిని తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

నేపాల్ టూరిజం, వ్యాపార రంగానికి భారీ ప్రయోజనం

నేపాల్ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇరు దేశాల మధ్య పర్యాటకం, వ్యాపారం గణనీయంగా పుంజుకుంటాయని భావిస్తున్నారు. భారత్-నేపాల్ సరిహద్దులు తెరిచి ఉండటం వల్ల ప్రతి ఏటా లక్షలాది మంది భారతీయ పర్యాటకులు నేపాల్ సందర్శిస్తుంటారు. అదేవిధంగా వేలాది మంది నేపాల్ పౌరులు ఉపాధి, విద్య, వ్యాపార నిమిత్తం భారతదేశంలో నివసిస్తున్నారు. ఇప్పటివరకు భారతీయ పెద్ద నోట్ల చెల్లుబాటుపై ఉన్న ఆంక్షల వల్ల ఎదురైన ఇబ్బందులు ఈ నిర్ణయంతో తొలగిపోనున్నాయి. ప్రయాణికులు నగదు లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story