Nestle: మ్యాగీ తయారీ సంస్థకు EPFO భారీ షాక్.. రూ.36.36 లక్షల డిమాండ్ నోటీసు జారీ
డిమాండ్ నోటీసు జారీ

Nestle: నిత్యావసర ఆహార ఉత్పత్తులు, ముఖ్యంగా మ్యాగీ తయారీతో గుర్తింపు పొందిన ప్రముఖ సంస్థ నెస్లే ఇండియాకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) డిమాండ్ నోటీసు పంపింది. 2012 నుంచి 2019 మధ్య కాలానికి గాను రూ.36.36 లక్షలు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొంది. ఇందులో రూ.20 లక్షలకు పైగా జరిమానా రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ మైసూరు ప్రాంతీయ కార్యాలయం 1952 చట్టంలోని సెక్షన్ 7Q, సెక్షన్ 14B కింద ఈ నోటీసు జారీ చేసినట్లు నెస్లే ఇండియా శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది.
డిమాండ్ నోటీసు అసలు సంగతేంటి?
నవంబర్ 26, 2026న అందిన ఈ నోటీసులో మొత్తం రూ.36,36,548 చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ నిబంధనల ప్రకారం 2012–2019 కాలానికి జరిమానా కింద రూ.20,09,516 కలిపి ఈ మొత్తం లెక్కించారు. ఈ నోటీసు వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితికి, రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి పెద్ద నష్టం లేదని నెస్లే ఇండియా స్పష్టం చేసింది. మ్యాగీతో పాటు నెస్కాఫే, కిట్‌క్యాట్, మిల్క్‌మేడ్, ఎవ్రీడే వంటి బ్రాండ్లతో నెస్లే దేశంలో భారీ మార్కెట్ కలిగి ఉంది. నోటీసు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో నెస్లే షేరు రూ.1317 వద్ద 0.28 శాతం స్వల్ప నష్టంతో ముగిసింది.
సెక్షన్ 7Q, 14B నిబంధనలు ఏం చెబుతున్నాయి?
పీఎఫ్ చట్టంలోని సెక్షన్ 7Q ప్రకారం, బకాయి పడిన మొత్తంపై యజమాని తప్పనిసరిగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సెక్షన్ 14B కింద పీఎఫ్ జమ చేయడంలో లేదా ఇతర చట్టబద్ధమైన బకాయిలు చెల్లించడంలో ఆలస్యం, లోపం జరిగితే ఈపీఎఫ్ఓ జరిమానా విధించే అధికారం కలిగి ఉంటుంది. ఈ రెండు సెక్షన్ల ఆధారంగానే సంస్థ గత కాలానికి సంబంధించిన లెక్కలను పరిశీలించి నోటీసు పంపింది.
బేబీ ఫుడ్ వార్తలపై నెస్లే వివరణ
మరోవైపు శిశువుల ఆహార ఉత్పత్తులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనపై వచ్చిన మీడియా కథనాలను నెస్లే ఇండియా ఖండించింది. గతంలో స్టాక్ ఎక్స్ఛేంజీ అడిగిన వివరణలో సెప్టెంబర్ 18, 2026న కంపెనీ స్పష్టత ఇచ్చింది. తమ నాన్ ఎక్సెల్లా ప్రో, లాక్టోజెన్ ప్రో వంటి ఉత్పత్తుల లేబుళ్లు, నిబంధనలు FSSAI నిపుణుల కమిటీ ఆమోదం పొందినవేనని తెలిపింది. లేబుళ్లపై ఉన్న సమాచారం శాస్త్రీయ ఆధారాలతో కూడినదేనని, సెబీ నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని, నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేస్తామని నెస్లే పేర్కొంది.

