మీ ఓటుతోనే షో విజేత ఎవరో తేలిపోతుంది

Netflix : నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫారమ్‌ను కేవలం రికార్డెడ్ వీడియోలకే పరిమితం చేయకుండా, లైవ్ ఈవెంట్‌ల వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా లైవ్ ఓటింగ్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అమెరికాలో ప్రసారమైన స్టార్ సెర్చ్ అనే టాలెంట్ షోలో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సాధారణంగా టీవీ షోలలో ఓటింగ్ వేస్తే ఫలితాల కోసం రోజుల తరబడి ఆగాలి. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు లైవ్ చూస్తూనే తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఓటు వేయొచ్చు. ఈ ఓటింగ్ ఫలితాలు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తాయి, దీనివల్ల షో చూసే అనుభవం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.

ఈ లైవ్ ఓటింగ్ ఫీచర్ కేవలం లైవ్ స్ట్రీమింగ్ చూసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు షోను మధ్యలో పాజ్ చేసి లేదా వెనక్కి జరిపి చూస్తుంటే ఓటింగ్ ఆప్షన్ పనిచేయదు. అలాగే వెబ్‌సైట్ ద్వారా చూసే వారికి కాకుండా స్మార్ట్ టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్‌లు, నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యాప్ ద్వారా చూసే వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించారు. స్టార్ సెర్చ్ షోలో ప్రేక్షకులు పెర్ఫార్మెన్స్‌ను 1 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇవ్వొచ్చు మరియు కొన్ని రౌండ్లలో నేరుగా విజేతను కూడా ఎంచుకోవచ్చు.

సాంకేతికపరంగా కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రెండు కొత్త ఫీచర్లను తెస్తోంది. మొదటిది ఏఐ సబ్‌టైటిల్ లోకలైజేషన్. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల్లోని సబ్‌టైటిల్స్ అనువాదం చేసేటప్పుడు, ఆయా భాషల యాస, భావం దెబ్బతినకుండా ఉండేలా ఏఐ చూసుకుంటుంది. రెండవది ఏఐ రికమెండేషన్ టూల్. ఇది వీక్షకుల ఇష్టాయిష్టాలను లోతుగా విశ్లేషించి, వారికి నచ్చే కంటెంట్‌ను మాత్రమే సూచిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ గ్రెగ్ పీటర్స్ మాట్లాడుతూ.. రాబోయే దశాబ్ద కాలానికి తగ్గట్టుగా మొబైల్ యాప్‌ను పూర్తిగా కొత్తగా డిజైన్ చేస్తున్నామని వెల్లడించారు.

ఇక ఆర్థిక ఫలితాల విషయానికొస్తే.. నెట్‌ఫ్లిక్స్ 2025 నాలుగో త్రైమాసికంలో ఏకంగా 12.05 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 17.6 శాతం వృద్ధి. కంటెంట్ పరంగా కూడా నెట్‌ఫ్లిక్స్ తన పరిధిని పెంచుకుంటోంది. షార్ట్ వీడియోల కోసం మొమెంట్స్ ఫీచర్‌ను బలోపేతం చేయడంతో పాటు, త్వరలో వీడియో పాడ్‌కాస్ట్‌లను కూడా తన యాప్‌లోకి తీసుకురాబోతోంది. మొత్తానికి వినోద రంగంలో నెట్‌ఫ్లిక్స్ ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story