రూ.75,000 వరకు వస్తువులు తెచ్చినా రూపాయి కట్టక్కర్లేదు

New Baggage Rules : విదేశాలకు వెళ్లే భారతీయులకు, అక్కడ నివసించి తిరిగి స్వదేశానికి వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్త బ్యగేజ్ నిబంధనలు అమల్లోకి రావడంతో, ఇకపై విదేశాల నుంచి తెచ్చే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ భారం గణనీయంగా తగ్గనుంది. బడ్జెట్‌లో ప్రకటించిన ఈ కొత్త వెసులుబాటుతో పర్యాటకులు, ప్రవాస భారతీయులు పండగ చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వస్తువులు తెచ్చే విషయంలో భారత ప్రభుత్వం దశాబ్ద కాలం తర్వాత కీలక మార్పులు చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా, నిన్న అర్ధరాత్రి నుంచి కొత్త బ్యగేజ్ రూల్స్ 2026 అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం, విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే భారతీయులు ఇప్పుడు రూ.75,000 విలువైన వస్తువులను ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా తెచ్చుకోవచ్చు. గతంలో ఈ పరిమితి కేవలం రూ.50,000 మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు అదనంగా మరో పాతిక వేల విలువైన షాపింగ్‌పై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. విదేశీ పర్యాటకుల విషయంలో కూడా ఈ పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచారు.

బంగారం దిగుమతి నిబంధనల్లో కేంద్రం విప్లవాత్మక మార్పులు చేసింది. విదేశాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం నివసించి తిరిగి వస్తున్న వారు తెచ్చే ఆభరణాలపై ఇప్పుడు 'విలువ' కంటే 'తౌకాన్ని' ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొత్త రూల్స్ ప్రకారం, మహిళలు 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు. పురుషులకైతే ఈ పరిమితి 20 గ్రాములుగా ఉంది. పాత నిబంధనల ప్రకారం మహిళలకు రూ.లక్ష, పురుషులకు రూ.50 వేల విలువైన బంగారం అనే పరిమితి ఉండేది. పెరిగిన బంగారం ధరల దృష్ట్యా విలువ పరిమితి వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటంతో, ప్రభుత్వం ఇప్పుడు గ్రాముల లెక్కన మినహాయింపు ఇచ్చింది.

మరో భారీ ఊరట ఏంటంటే.. పరిమితికి మించి తెచ్చే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం సగానికి తగ్గించింది. గతంలో రూ.50 వేల పరిమితి దాటితే అదనపు వస్తువులపై 20 శాతం పన్ను వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ సుంకాన్ని 10 శాతానికి తగ్గించారు. ఉదాహరణకు, మీరు విదేశాల నుంచి రూ.2 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తెచ్చారనుకుంటే.. అందులో రూ.75,000 కి పన్ను ఉండదు. మిగిలిన రూ.1.25 లక్షల మీద కేవలం 10 శాతం అంటే రూ.12,500 కడితే సరిపోతుంది. గతంలో ఇదే వస్తువులకు రూ.25,000 పైగా పన్ను కట్టాల్సి వచ్చేది.

ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను విదేశాల నుంచి తెచ్చుకోవాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. అయితే, వ్యాపార అవసరాల కోసం భారీ మొత్తంలో వస్తువులను తెస్తే మాత్రం సాధారణ వాణిజ్య సుంకాలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. కేవలం వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చే లగేజీకి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story