బ్యాంక్ ఖాతా, లాకర్‌ నియమాల్లో కీలక మార్పులు

New Banking Rules : దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఒక కీలక ప్రకటన చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1, 2025 నుండి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త మార్పులు మీ బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, సురక్షిత కస్టడీలో ఉంచిన ఆస్తులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా నామినేషన్ విషయంలో ఖాతాదారులకు మరింత నియంత్రణ, సౌలభ్యాన్ని కల్పించే ఈ కొత్త నిబంధనల వివరాలను తెలుసుకుందాం.

కొత్తగా తీసుకొచ్చిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025 ప్రకారం, నామినేషన్ విషయంలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్లు లేదా లాకర్లకు ఒకరు లేదా ఇద్దరు నామినీలను మాత్రమే సెలక్ట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, ఖాతాదారులు ఇకపై ఒకేసారి లేదా వరుస పద్ధతిలో గరిష్టంగా నలుగురు వ్యక్తులను నామినీలుగా చేయవచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ ప్రక్రియ సులభతరం అవుతుంది.

కొత్త నిబంధనల ప్రకారం, ఖాతాదారులు తమ డిపాజిట్లలోని వాటాను కూడా నామినీలకు కేటాయించవచ్చు. ఉదాహరణకు, ఒక నామినీకి 50%, మరొకరికి 30%, ఇంకొకరికి 20% చొప్పున వాటాలను నిర్ణయించవచ్చు. ఈ పద్ధతి పూర్తి పారదర్శకతను తీసుకొచ్చి, వారసత్వ వివాదాలకు ఆస్కారం తగ్గిస్తుంది.

లాకర్లు, బ్యాంకు సురక్షిత కస్టడీలో ఉంచిన విలువైన వస్తువుల నామినీల విధానంలో ఒక ముఖ్యమైన మార్పు చేశారు. లాకర్లు లేదా సేఫ్ కస్టడీ వస్తువుల కోసం ఇకపై వరుస నామినేషన్ మాత్రమే అనుమతించబడుతుంది. అంటే, మొదటి నామినీ మరణించిన తర్వాతే, జాబితాలో తర్వాతి నామినీకి ఆ లాకర్ లేదా ఆస్తులు క్లెయిమ్ చేసుకునే అర్హత లభిస్తుంది. దీనివల్ల యజమాన్యం, వారసత్వ ప్రక్రియ మరింత స్పష్టంగా ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ కొత్త మార్పుల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, భద్రత పెరుగుతాయని నమ్ముతోంది. ఈ మార్పులు కేవలం నామినీలకే పరిమితం కావు. బ్యాంకింగ్ రంగంలో పెద్ద సంస్కరణలకు ఇవి నాంది పలుకుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story