EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పీఎఫ్ ఖాతాదారులకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద మూడు కొత్త సామాజిక భద్రతా పథకాలను నోటిఫై చేసింది. ఇందులో ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026, ఉద్యోగుల పెన్షన్ పథకం 2026, డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం 2026 ఉన్నాయి. ఈ సరికొత్త నిబంధనల ప్రకారం.. పీఎఫ్ విత్‌డ్రా, పెన్షన్ లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను నిర్ణీత సమయంలోగా సెటిల్ చేయకపోతే, దానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానా కూడా విధించనున్నారు.

క్లెయిమ్స్ ఆలస్యమైతే 12 శాతం వడ్డీ

కొత్త రూల్స్ ప్రకారం, పీఎఫ్ ఖాతాదారుడు అన్ని అవసరమైన డాక్యుమెంట్లు, ఫార్మాలిటీస్ పూర్తి చేసి దరఖాస్తు చేసుకున్న తర్వాత.. కేవలం 20 రోజుల లోపు పీఎఫ్ విత్‌డ్రా, పెన్షన్ లేదా బీమా క్లెయిమ్‌ను ఆఫీసర్లు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి సరైన కారణం లేకుండా ఈ 20 రోజుల గడువు దాటితే, సంబంధిత పీఎఫ్ కమిషనర్ లేదా బాధ్యుడైన అధికారిని దోషిగా పరిగణిస్తారు. అలా ఆలస్యమైన కాలానికి గాను, సదరు క్లెయిమ్ మొత్తంపై ఏటా 12 శాతం చొప్పున దండన వడ్డీని లెక్కించి ఖాతాదారునికి చెల్లించాల్సి ఉంటుంది.

జవాబుదారీతనం పెంచేందుకే ఈ నిర్ణయం

ఈ సరికొత్త నిబంధనలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. ఆలస్యమైనందుకు చెల్లించాల్సిన 12 శాతం వడ్డీ డబ్బులను ఈపీఎఫ్ఓ ఫండ్స్ నుంచి ఇవ్వరు. దానికి బదులుగా, ఏ అధికారి నిర్లక్ష్యం వల్ల క్లెయిమ్ ఆలస్యమైందో, ఆ బాధ్యుడైన అధికారి నెలవారీ జీతం నుంచి ఈ వడ్డీ మొత్తాన్ని రికవరీ చేస్తారు. పీఎఫ్ కార్యాలయాల్లో ఫైళ్లను నానబెట్టే సంస్కృతికి చరమగీతం పాడటానికి, అధికారుల్లో జవాబుదారీతనం పెంచి క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా క్లెయిమ్స్ ఆలస్యమైతే వడ్డీ చెల్లించే నిబంధన ఉండేది, కానీ అప్పట్లో ఈపీఎఫ్ఓ ప్రకటించే సాధారణ పీఎఫ్ వడ్డీ రేటుతో సమానంగా అది ఉండేది. ఇప్పుడు దానిని మార్చి ఏకంగా 12 శాతం వార్షిక ఫిక్స్‌డ్ రేటుగా మార్చారు.

ఉద్యోగులు, కంపెనీల పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌లో మార్పులు లేవు

కొత్త పథకాలు అమల్లోకి వచ్చినప్పటికీ, ఉద్యోగులు, యాజమాన్యాల నెలవారీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూల్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత పద్ధతిలోనే ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ నుంచి 12 శాతం వాటాను పీఎఫ్ ఖాతాకు అందిస్తారు. కంపెనీలు కూడా తమ వంతుగా 12 శాతం కాంట్రిబ్యూషన్‌ను కొనసాగిస్తాయి. యాజమాన్యం ఇచ్చే ఈ 12 శాతం వాటా నుంచి 8.33 శాతం డబ్బు ఉద్యోగుల పెన్షన్ పథకానికి బదిలీ అవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే తన వంతుగా 1.16 శాతం నిధులను పెన్షన్ అకౌంట్‌కు జమ చేస్తూనే ఉంటుంది.

పూర్తి డిజిటల్ సేవలకు ఈపీఎఫ్ఓ ప్రాధాన్యత

ఈ సరికొత్త 2026 పథకాల ప్రధాన లక్ష్యం ఈపీఎఫ్ఓ డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేయడం. పీఎఫ్ చందాదారులు చిన్న చిన్న పనుల కోసం ఆఫీసుల చుట్టూ, దళారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వంద శాతం ఆన్‌లైన్ ద్వారానే సేవలందించేలా సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. క్లెయిమ్‌లు, అప్లికేషన్ల ఈ-ఫైలింగ్‌ను తప్పనిసరి చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే మినహాయింపు పొందిన సంస్థలు, పీఎఫ్ ట్రస్ట్‌లు కూడా ఇకపై తమ డాక్యుమెంట్లను ఆన్‌లైన్ ద్వారానే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పీఎఫ్ విత్‌డ్రా, పెన్షన్, ఇన్సూరెన్స్ సేవలు కస్టమర్లకు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయి.

సాధారణ ఉద్యోగులకు ఈ కొత్త రూల్ వల్ల కలిగే లాభాలు ఏంటంటే!

* పీఎఫ్, పెన్షన్ డబ్బులు సెటిల్ కావడానికి పట్టే సమయం చాలా వరకు తగ్గుతుంది.

* ఆఫీసర్లలో బాధ్యత పెరగడం వల్ల ఫైళ్లు త్వరగా క్లియర్ అవుతాయి.

* పూర్తి ఆన్‌లైన్ ప్రాసెస్ కావడం వల్ల కాగితాల పని, డాక్యుమెంట్ల గోల తప్పుతుంది.

* తమ క్లెయిమ్ ఏ స్టేజ్‌లో ఉందో డిజిటల్ పద్ధతిలో కస్టమర్లు సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story