New Rules from May 1 : జేబు ఖాళీ అవ్వకముందే జాగ్రత్త.. మే 1 నుంచి అమల్లోకి వచ్చిన 7 కీలక మార్పులు ఇవే
మే 1 నుంచి అమల్లోకి వచ్చిన 7 కీలక మార్పులు ఇవే

New Rules from May 1 : మే నెల వచ్చేసింది.. ఏప్రిల్ ఎండల కంటే ఎక్కువగా కొత్త నిబంధనలు సామాన్యుడి జేబును వేడెక్కిస్తున్నాయి. 2026 మే 1వ తేదీ నుంచి దేశంలో ఆర్థిక పరమైన పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల దగ్గర నుంచి ఏటీఎం విత్ డ్రాయల్స్ వరకు, ఆన్‌లైన్ గేమింగ్ నుంచి యూపీఐ పేమెంట్ల వరకు అనేక కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇవి నేరుగా మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపనున్నాయి.
గ్యాస్ డెలివరీకి ఓటీపీ తప్పనిసరి:
ఇకపై గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి రావాలంటే ఫోన్ వెంట ఉండాల్సిందే. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ డెలివరీ బాయ్‌కి చెబితేనే సిలిండర్ అప్పగిస్తారు. గ్యాస్ చోరీలను, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిబంధనను కఠినతరం చేసింది. దీనివల్ల సరైన లబ్ధిదారుడికే గ్యాస్ అందుతుందన్నది అధికారుల మాట.
సిలిండర్ ధరల వడ్డన
మరోవైపు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ.993 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో తిండి ఖరీదు పెరిగే అవకాశం ఉంది. అయితే, గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. కానీ కమర్షియల్ గ్యాస్ భారం పరోక్షంగా సామాన్యుడిపై పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఏటీఎం ఛార్జీలు.. బ్యాలెన్స్ లేకపోతే ఫైన్
ఏటీఎం వాడే వారికి మే 1 నుంచి షాక్ తగలనుంది. నెలకు నిర్ణీత సంఖ్యలో (ఉదాహరణకు 5 సార్లు) మాత్రమే ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఆ పరిమితి దాటితే ప్రతి విత్ డ్రాయల్‌పై రూ.23 వసూలు చేస్తారు. అంతేకాదు, మీ అకౌంట్లో డబ్బులు లేక ఏటీఎం లావాదేవీ విఫలమైతే, దానికి కూడా రూ.25 జరిమానా విధిస్తున్నారు. కాబట్టి ఏటీఎంకి వెళ్లే ముందు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఉత్తమం.
యూపీఐ సెక్యూరిటీ & ఆన్‌లైన్ గేమింగ్:
యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితం చేయడానికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా అదనపు భద్రతా ఫీచర్లను జోడించారు. ఇక ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. మనీ గేమ్స్, సోషల్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ అని మూడు విభాగాలుగా విభజించి, నగదుతో కూడిన గేమ్‌లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. వీటిపై ప్రభుత్వ నిఘా గట్టిగా ఉండనుంది.
క్రెడిట్ కార్డ్ రూల్స్ :
నేటి నుంచి చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లపై కోత విధించాయి. ముఖ్యంగా ఇంటి అద్దె చెల్లింపులు, కరెంట్ బిల్లుల లావాదేవీలపై వచ్చే బెనిఫిట్స్ తగ్గనున్నాయి.
విమాన ప్రయాణం
విమాన ఇంధనం (ATF)పై ప్రభుత్వం ఎగుమతి సుంకం విధించినప్పటికీ, దేశీయ విమాన ధరలపై అది ప్రభావం చూపదని తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి విమాన టికెట్ల ధరలు స్థిరంగానే ఉండే అవకాశం ఉంది.

