Income Tax Rules : భారతదేశంలో ఆదాయపు పన్ను నిబంధనలు మారుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన సరికొత్త నిబంధనల ప్రకారం, ఇకపై మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే కష్టమే.పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలన్నా, ఖరీదైన వస్తువులు కొనాలన్నా పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో పాన్ కార్డ్ లేని వారు ఫామ్ 60 ఇచ్చి పని పూర్తి చేసుకునేవారు, కానీ ఇప్పుడు ఆ ఫామ్ స్థానంలో ఫామ్ 97 వచ్చినా.. కొన్ని కీలక పనులకు మాత్రం కేవలం పాన్ కార్డ్ మాత్రమే ఉండాలని ఇన్కమ్ టాక్స్ శాఖ స్పష్టం చేసింది.

రూ. 2 లక్షలు దాటితే నో కాంప్రమైజ్

ఆదాయపు పన్ను చట్టం 2025, రూల్స్ 2026 ప్రకారం ఏదైనా వస్తువు లేదా సేవను రూ.2 లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి. మీరు నగదు రూపంలో ఇచ్చినా లేదా ఇతర మార్గాల్లో చెల్లించినా పాన్ నంబర్ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలు కొనేవారు పాన్ కార్డు లేకుండా షాపింగ్ చేయడం సాధ్యం కాదు. దీనివల్ల నల్లధనాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఫామ్ 97 ఎప్పుడు పనికిరాదు?

గతంలో పాన్ కార్డు లేని వారు ఇచ్చే ఫామ్ 60 స్థానంలో ఇప్పుడు ఫామ్ 97ను ప్రవేశపెట్టారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫామ్ కూడా చెల్లదు, కేవలం పాన్ నంబర్ మాత్రమే ఇవ్వాలి. అవేంటంటే:

* వాహనాల కొనుగోలు: రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన కారు లేదా బైక్ కొనేటప్పుడు.

* క్రెడిట్ కార్డ్, డీమ్యాట్: కొత్త క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసినా లేదా స్టాక్ మార్కెట్ కోసం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.

* పెట్టుబడులు: మ్యూచువల్ ఫండ్స్ లేదా బాండ్లలో రూ. 50,000 కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేటప్పుడు.

* నగదు లావాదేవీలు: బ్యాంకులో ఏడాదికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసినా.

సామాన్యులకు ఊరట ఇచ్చే అంశాలు

కొత్త నిబంధనల వల్ల ఫామ్స్ నింపే తిప్పలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. టెక్నాలజీని వాడి ఫామ్‌లను ప్రీ-ఫిల్డ్ (ముందే నింపిన) ఫార్మాట్‌లో ఉంచడం వల్ల తప్పులు తగ్గుతాయి. గతంలో ఏటా 12 కోట్ల ఫామ్ 60లు దాఖలయ్యేవి, ఇప్పుడు ఆ సంఖ్య 2 కోట్లకు తగ్గుతుందని అంచనా. చిన్న చిన్న లావాదేవీలను రిపోర్టింగ్ పరిధి నుంచి తొలగించారు. విదేశీ కరెన్సీ కొనుగోలు, బ్యాంక్ డ్రాఫ్టుల నగదు కొనుగోలు వంటి కొన్ని పనులకు ఫామ్ 97 అవసరం లేదని స్పష్టం చేశారు.

నిబంధనల వెనుక అసలు లక్ష్యం

ఈ మార్పుల వల్ల పన్ను వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. బినామీ లావాదేవీలు, తప్పుడు సమాచారంతో చేసే ఫైనాన్షియల్ డీల్స్‌కు అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. చార్టర్డ్ అకౌంటెంట్ల అభిప్రాయం ప్రకారం.. ఇకపై ప్రతి పెద్ద ఖర్చు పన్ను శాఖ నిఘాలో ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఇంకా పాన్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవడం లేదా ఉన్న కార్డును ఆధార్‌తో లింక్ చేసి అప్‌డేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

PolitEnt Media

PolitEnt Media

Next Story