Packaging Rules: సబ్బులు, షాంపూలపై కూడా ఆ గుర్తులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు

Packaging Rules: భారతదేశంలో వినియోగించే వివిధ రకాల ప్యాకేజ్డ్ కమ్యూడిటీల నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక సవరణలు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆహార పదార్థాలపై మాత్రమే కనిపించే శాఖాహార, మాంసాహార గుర్తులు ఇకపై సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులు, ఇతర సౌందర్య ఉత్పత్తుల ప్యాకింగ్‌పై కూడా ముద్రించడాన్ని తప్పనిసరి చేశారు. లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం అమల్లోకి వచ్చిన ఈ కొత్త మార్పులతో వినియోగదారులు తాము కొనుగోలు చేసే ఉత్పత్తుల స్వభావాన్ని సులభంగా గుర్తించే అవకాశం లభిస్తుంది.
పచ్చ, ఎరుపు చుక్కల గుర్తుల వెనుక అసలు నిజం
ఈ కొత్త సవరణల ప్రకారం.. ఏ వస్తువు అయితే పూర్తిగా శాఖాహార మూలకాలతో తయారవుతుందో దాని ప్యాకెట్ పైభాగంలో ఆకుపచ్చ రంగు చుక్కను ముద్రించాల్సి ఉంటుంది. అలాగే ఏ ఉత్పత్తుల తయారీలోనైనా మాంసాహార సంబంధిత పదార్థాలను ఉపయోగించినట్లయితే వాటిపై ఎరుపు లేదా గోధుమ రంగు చుక్క ఉండటం తప్పనిసరి. ఈ ప్రత్యేక గుర్తులు ప్యాకేజీ ప్రధాన డిస్ప్లే ప్యానెల్ పైభాగంలో స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చాయి.
ఈ నిబంధనల వెనుక ఉన్న నేపథ్యం
నిజానికి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై ఇలాంటి గుర్తులు ఉండాలనే నిబంధన గతంలో 2014 నాటి చట్టంలోనే ఉండేది. అయితే సెప్టెంబర్ 2026లో తెచ్చిన కొత్త సవరణల ద్వారా దీనికి సంబంధించిన చట్టపరమైన నిర్మాణాన్ని మరింత స్పష్టంగా మార్చారు. గతంలో ఉన్న కొన్ని నిబంధనలను తొలగించి సరికొత్త సెక్షన్ కింద దీన్ని చేర్చారు. ఈ విషయమై గతంలో ఢిల్లీ హైకోర్టులో కూడా కొన్ని న్యాయపరమైన విచారణలు జరిగాయి. కాస్మోటిక్స్, టాయిలెట్రీస్ లేబులింగ్ విధానంపై స్పష్టమైన వైఖరిని అవలంబించాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్పష్టతనిచ్చింది.
మన దేశంలో విక్రయించే ప్రతి సౌందర్య ఉత్పత్తి ప్యాకింగ్‌పై తప్పనిసరిగా కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. కాస్మోటిక్స్ రూల్స్ 2020, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం ప్రొడక్ట్ పేరు, తయారీదారుల పూర్తి చిరునామా, దిగుమతిదారు వివరాలు స్పష్టంగా ఉండాలి. బరువు, వాల్యూమ్, బాచ్ నంబర్, తయారీ లైసెన్స్ నంబర్, తయారీ, ఎక్స్పైరీ తేదీలతో పాటు అన్ని పన్నులతో కూడిన ఎమ్మార్పీని ముద్రించాలి. అంతేకాకుండా ఉపయోగించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పదార్థాల జాబితాను కూడా స్పష్టంగా పొందుపరచడం చట్టరీత్యా తప్పనిసరి.

