PAN Card Rules : పాన్ కార్డు పొందడం ఇక గగనమే.. ఆధార్ కార్డు పవర్‌కు బ్రేకులు వేసిన కొత్త రూల్స్
ఆధార్ కార్డు పవర్‌కు బ్రేకులు వేసిన కొత్త రూల్స్

PAN Card Rules : ఆర్థిక లావాదేవీల్లో అత్యంత కీలకమైన పాన్ కార్డు నిబంధనలు నేటి నుంచి (ఏప్రిల్ 1, 2026) పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు ఆధార్ కార్డు ఉంటే చాలు, చిటికెలో పాన్ కార్డు వచ్చేసేది. కానీ, ఇకపై ఆ పప్పులు ఉడకవు. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నకిలీ పాన్ కార్డుల బెడదను అరికట్టడానికి, భద్రతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసేవారు లేదా పాత కార్డులో మార్పులు చేసుకోవాలనుకునే వారు ఈ కొత్త రూల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఆధార్ కార్డు ఒక్కటే ఉంటే ఇక సరిపోదు!
నిన్నటి వరకు (మార్చి 31, 2026) పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం చాలా సులభంగా ఉండేది. కేవలం ఆధార్ కార్డు వివరాలు ఇస్తే సరిపోయేది, పెద్దగా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఏప్రిల్ 1 నుంచి ఈ సౌలభ్యం ముగిసింది. ఇకపై కేవలం ఆధార్ బేసిస్‌పై పాన్ కార్డు పొందడం సాధ్యం కాదు. దరఖాస్తుదారులు తమ గుర్తింపును, పుట్టిన తేదీని ధృవీకరించడానికి అదనపు ప్రభుత్వ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలి. దీనివల్ల పాన్ కార్డు జారీ ప్రక్రియ మునుపటి కంటే కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఏ ఏ పత్రాలు అవసరమవుతాయి?
కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్‌తో పాటు కింది వాటిలో ఏదైనా ఒక పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది:
* పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
* ఓటర్ ఐడి కార్డు
* పాస్‌పోర్ట్
* డ్రైవింగ్ లైసెన్స్
* 10వ తరగతి సర్టిఫికేట్
* గెజిటెడ్ ఆఫీసర్ లేదా మేజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్
ఈ పత్రాల వల్ల పాన్ కార్డు డేటా మరింత ఖచ్చితంగా ఉంటుంది.మోసాలకు తావుండదు.
ఆధార్‌తో వివరాలు సరిపోలాల్సిందే
మీరు పాన్ కార్డుకు దరఖాస్తు చేసే ముందు మీ ఆధార్ కార్డులోని వివరాలను ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది. మీ పేరులోని అక్షరాలు, ఇంటి పేరు, పుట్టిన తేదీ ఆధార్‌లో ఎలా ఉన్నాయో, పాన్ అప్లికేషన్‌లో కూడా అలాగే ఉండాలి. ఒక్క అక్షరం తేడా ఉన్నా మీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. కాబట్టి ఆధార్‌లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ముందే సరిదిద్దుకోవడం ఉత్తమం. పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఐటీ శాఖ ఈ నిబంధనను కఠినతరం చేసింది.
పాత ఫారాలకు స్వస్తి.. కొత్త ఫారాలు ఇన్
ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డు దరఖాస్తు కోసం పాత ఫారాలు చెల్లవు. ప్రభుత్వం సరికొత్త దరఖాస్తు ఫారాలను అందుబాటులోకి తెచ్చింది. మీరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేస్తున్నారా లేదా కంపెనీ తరపున చేస్తున్నారా అనే దాన్ని బట్టి వేర్వేరు ఫారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పోర్టల్స్‌లో కూడా ఈ మార్పులు ఇప్పటికే జరిగాయి. పాత ఫారమ్ ద్వారా అప్లై చేస్తే అది చెల్లదు కాబట్టి, కొత్త ఫారమ్‌లనే వాడాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎందుకీ మార్పులు?
పాన్ కార్డును ఒక పక్కా గుర్తింపు కార్డుగా మార్చడమే ప్రభుత్వం ఉద్దేశం. ఆధార్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లు అడగడం ద్వారా ఒకే వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉండకుండా చూడవచ్చు. అలాగే ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఈ పటిష్టమైన వెరిఫికేషన్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. సామాన్యులకు ఇది కొంచెం శ్రమతో కూడుకున్న పనే అయినా, దీర్ఘకాలంలో ఇది ఆర్థిక భద్రతను పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

