ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

New PAN Rules :కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న సరికొత్త ఆదాయపు పన్ను చట్టం సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు తీసుకురానుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న ఈ చట్టంలో భాగంగా పాన్ కార్డు నిబంధనలను ప్రభుత్వం భారీగా సవరించింది. ముఖ్యంగా నగదు డిపాజిట్లు, వాహనాల కొనుగోలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో పాన్ కార్డు వినియోగానికి సంబంధించి కొత్త పరిమితులను ప్రతిపాదించింది. పన్నుల వ్యవస్థను సరళీకృతం చేస్తూనే, పారదర్శకతను పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం.

నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌లో మార్పు

కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసినా పాన్ కార్డును నమోదు చేయడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం రోజుకు రూ.50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే పాన్ చూపాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన వల్ల పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు చేసే వారికి కొంత వెసులుబాటు లభిస్తుందని, అలాగే వార్షిక లెక్కలు తేల్చడం సులభతరం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

వాహన కొనుగోలు, హోటల్ బిల్లులు

వాహనాల కొనుగోలు విషయంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ప్రస్తుతం ఏ విలువ గల మోటారు వాహనం కొన్నా పాన్ కార్డు తప్పనిసరి. కానీ కొత్త రూల్ ప్రకారం, వాహనం విలువ రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటేనే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు లేదా ఫంక్షన్ హాళ్ల బిల్లుల విషయంలో పాన్ పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచారు. అంటే రూ.లక్ష లోపు బిల్లులకు ఇకపై పాన్ కార్డు అవసరం లేదన్నమాట.

రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ రంగం

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తూనే పరిమితులను సవరించింది. ప్రస్తుతం రూ.10 లక్షల విలువైన ఆస్తుల క్రయవిక్రయాలకు పాన్ అవసరం కాగా, దీనిని రూ.20 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. అయితే, ఇన్సూరెన్స్ రంగంలో మాత్రం నిబంధనలు కఠినమయ్యాయి. ఇకపై ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడే పాన్ కార్డు సమర్పించడం తప్పనిసరి కానుంది. ప్రస్తుతం కేవలం ఏడాదికి రూ.50,000 కంటే ఎక్కువ ప్రీమియం కడితేనే పాన్ అడుగుతున్నారు.

డిజిటల్ కరెన్సీకి అధికారిక హోదా

కొత్త ఆదాయపు పన్ను చట్టం కేవలం పరిమితులకే పరిమితం కాలేదు. ఇది డిజిటల్ యుగానికి అనుగుణంగా మారుతోంది. ఇందులో భాగంగా CBDC (Digital Rupee) ను అధికారిక ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతిగా గుర్తించారు. అలాగే క్రిప్టో లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఐటీ రిటర్న్స్‌లో సమర్పించడం ఇకపై తప్పనిసరి కానుంది. ఈ మార్పులన్నీ పన్ను చెల్లింపుదారులకు సులభమైన అనుభవాన్ని అందించడమే కాకుండా, పన్ను ఎగవేతలను అరికట్టడానికి దోహదపడతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story