New Rules August 1 : కొత్త నెల ప్రారంభంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అనేక కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ నింపాలన్నా, రైలు ప్రయాణం చేయాలన్నా లేదా క్రెడిట్ కార్డులు వినియోగించాలన్నా నేటి నుంచి కొన్ని కొత్త విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎల్పీజీ ధరల సవరణ, రైల్వే తత్కాల్ బుకింగ్ విధానం, సీకేవైసీ 2.0 అప్‌డేట్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ నిబంధనల్లో మార్పులు జరిగాయి. వీటి గురించి ముందుగా తెలుసుకోకపోతే అనవసరపు ఆర్థిక భారాన్ని మోయాల్సి రావచ్చు.

కమర్షియల్ ఎల్పీజీ ధర తగ్గింపు

ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. అందులో భాగంగా ఈరోజు నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో భారీ కోత విధించారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.200 కి పైగా తగ్గింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.202 తగ్గి ఇప్పుడు రూ.2,728కి లభిస్తోంది. అలాగే కోల్‌కతాలో రూ.209 వరకు తగ్గింది. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెట్రోల్, డీజిల్ రోజువారీ ధరల సవరణ యథాతథంగా కొనసాగుతోంది.

ఐటీఆర్ ఆలస్యమైతే జరిమానా బాదుడు

సాధారణ పన్ను చెల్లింపుదారులు (ఆడిట్ లేనివారు) ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీగా ఉండేది. ఆ డెడ్‌లైన్ ముగియడంతో, నేటి నుంచి ITR-1 లేదా ITR-2 ఫారమ్‌ల ద్వారా రిటర్న్స్ దాఖలు చేసేవారు భారీ ఆలస్య రుసుము (Late Fee) చెల్లించాల్సి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం ఆధారంగా ఈ జరిమానా విధిస్తారు.

క్రెడిట్ కార్డ్ రూల్స్ కఠినం

పలు ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ నియమ నిబంధనలను కఠినతరం చేశాయి. రివార్డ్ పాయింట్లు, లేట్ పేమెంట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజుల నిబంధనలను సవరించాయి. హిడెన్ ఛార్జీల బారిన పడకుండా ఉండాలంటే కార్డుదారులు ఈ కొత్త షరతులను పరిశీలించుకోవడం మంచిది.

రైల్వే తత్కాల్ టికెట్లకు టోకెన్ సిస్టమ్.. సీకేవైసీ 2.0 అమలు!

రైలు ప్రయాణికుల కోసం వెస్ట్ సెంట్రల్ రైల్వే సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం ఇన్నాళ్లూ గంటల తరబడి క్యూలలో నిలబడే కష్టాలకు చెక్ పెడుతూ టోకెన్ సిస్టమ్‎ను ప్రారంభించారు. ఇప్పుడు కౌంటర్ దగ్గర ముందుగా టోకెన్ తీసుకుంటే, దాని క్రమం ఆధారంగానే టికెట్లు ఇస్తారు. దీనితో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితం చేయడానికి సెంట్రల్ కేవైసీ 2.0ను దశలవారీగా అమలు చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో ప్రతిసారీ పత్రాలు సమర్పించే పనిలేకుండా వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story