New Salary Rule : ఉద్యోగులకు ఏప్రిల్ 1 షాక్.. నేటి నుంచి మారిన జీతాల లెక్క.. చేతికి వచ్చే నగదు తగ్గుతుందా?
చేతికి వచ్చే నగదు తగ్గుతుందా?

New Salary Rule : ఏప్రిల్ 1, 2026.. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ తేదీ కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, కోట్లాది మంది ఉద్యోగుల జీవితాల్లో, వారి జీతాల లెక్కల్లో పెను మార్పులకు నాంది పలికింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, కొత్త లేబర్ కోడ్ నేటి నుంచి అమలులోకి వచ్చాయి. దీనివల్ల మీ పే-స్లిప్ మునుపటిలా ఉండదు. మీ చేతికి వచ్చే జీతం తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ మార్పులు ఏమిటి? మీ జేబుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? అన్నది వివరంగా తెలుసుకుందాం.
బేసిక్ పే 50 శాతం ఉండాల్సిందే
కొత్త లేబర్ కోడ్ ప్రకారం, ఒక ఉద్యోగికి ఇచ్చే మొత్తం సిటిసి (CTC)లో బేసిక్ పే కనీసం 50 శాతం ఉండాలి. ఇప్పటివరకు చాలా కంపెనీలు ట్యాక్స్ ఆదా చేయడానికి బేసిక్ పేని తక్కువగా చూపిస్తూ.. హెచ్ఆర్ఏ, ట్రావెల్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ వంటి వాటిని 70 నుంచి 80 శాతం వరకు పెంచి ఇచ్చేవి. కానీ ఇకపై అది కుదరదు. అన్ని రకాల అలవెన్సులు కలిపినా సరే, అవి మొత్తం జీతంలో 50 శాతానికి మించకూడదు. అంటే కంపెనీలు కచ్చితంగా మీ బేసిక్ పేని పెంచాల్సిందే.
చేతికి వచ్చే జీతం ఎందుకు తగ్గుతుంది?
బేసిక్ పే పెరగడం వల్ల మీ భవిష్య నిధి, గ్రాట్యుటీ లెక్కలు మారిపోతాయి. పీఎఫ్ అనేది మీ బేసిక్ పే మీద ఆధారపడి కట్ అవుతుంది. ఎప్పుడైతే బేసిక్ పే పెరుగుతుందో, మీ జీతం నుంచి పీఎఫ్ వాటా కింద కట్ అయ్యే సొమ్ము కూడా పెరుగుతుంది. దీనివల్ల మీ రిటైర్మెంట్ ఫండ్ భారీగా పెరుగుతుంది కానీ, నెలాఖరున మీ చేతికి వచ్చే నగదు కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే మీ కంపెనీ ఇప్పటికే 50 శాతం బేసిక్ పే ఇస్తుంటే, మీపై ఎలాంటి ప్రభావం ఉండదు.
పాత ట్యాక్స్ విధానంలో చిక్కులు..
బేసిక్ పే పెరగడం వల్ల పాత ట్యాక్స్ విధానం అనుసరించే వారికి కొంత ఇబ్బంది కలగవచ్చు. మీరు పొందే హెచ్ఆర్ఏ మినహాయింపు మీ బేసిక్ పే మీద ఆధారపడి ఉంటుంది. బేసిక్ పెరిగితే, ఇంటి అద్దెలో మీరు చూపే మినహాయింపు తగ్గిపోయి, పన్ను చెల్లించాల్సిన ఆదాయం పెరగవచ్చు. అయితే రూ.10 నుంచి 30 లక్షల మధ్య ఆదాయం ఉండి, మెట్రో నగరాల్లో ఉండేవారు 80C, ఎన్పీఎస్ వంటి పథకాల ద్వారా పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఇంకా ఉంది.
కొత్త ట్యాక్స్ విధానం - ఊరటనిచ్చే వార్త
కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి ఈ మార్పుల వల్ల పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే కొత్త విధానంలో రూ.12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను సున్నా. ఇందులో హెచ్ఆర్ఏ మినహాయింపులు ఉండవు కాబట్టి బేసిక్ పే పెరిగినా మీ ట్యాక్స్ లెక్కల్లో పెద్దగా తేడా రాదు. రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ.12.75 లక్షల లోపు సంపాదన ఉంటే రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు.

