New Tax Regime Guide : భారతదేశంలో ఆదాయపు పన్ను చెల్లించే సాలరీడ్ ఉద్యోగులలో చాలా మందికి కొత్త పన్ను విధానం పై ఒక పెద్ద అపోహ ఉంది. ఇందులో పాత పద్ధతి లాగా సెక్షన్ 80సి కింద ఇన్సూరెన్స్, పీపీఎఫ్ వంటి వాటి ద్వారా టాక్స్ సేవింగ్స్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి, పన్ను ఆదా చేయడం అస్సలు కుదరదని అనుకుంటారు. కానీ ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించి కొత్త పన్ను విధానంలో కూడా కొన్ని ప్రత్యేక మినహాయింపులు, కటింపులు అందుబాటులో ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో వాడుకుంటే మీ ట్యాక్స్ భారాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు.

ఎన్‌పీఎస్‎లో కంపెనీ కాంట్రిబ్యూషన్

కొత్త పన్ను విధానంలో ఉద్యోగి స్వయంగా చేసుకునే ఎన్‌పీఎస్ పెట్టుబడికి ఎలాంటి మినహాయింపు లభించదు. కానీ, మీ కంపెనీ లేదా యాజమాన్యం మీ పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టమ్‎లో జమ చేసే మొత్తానికి సెక్షన్ 80CCD(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగి బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్ కలిపిన మొత్తంలో 14 శాతం వరకు కంపెనీ జమ చేస్తే.. దానికి పూర్తి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఉదాహరణకు బేసిక్, డీఏ కలిపి రూ.12 లక్షలు ఉంటే.. కంపెనీ జమ చేసే రూ.1.68 లక్షలపై రూపాయి కూడా పన్ను పడదు. ఇది స్టాండర్డ్ డిడక్షన్‌కు అదనం కావడం గమనార్హం.

ఈపీఎఫ్ ద్వారా లభించే ప్రయోజనాలు

కొత్త పన్ను విధానంలో ఉద్యోగి చెల్లించే ఈపీఎఫ్ వాటాకు ఎలాంటి 80సి బెనిఫిట్ రాదు. అయితే, కంపెనీ లేదా ఎంప్లాయర్ మీ ఈపీఎఫ్ ఖాతాకు అందించే కాంట్రిబ్యూషన్‌కు ఒక నిర్దిష్ట పరిమితి వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉద్యోగులు ఒక చిన్న నియమాన్ని గుర్తుంచుకోవాలి. కంపెనీ తరఫున ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్‌లలో కలిపి వేసే మొత్తం వార్షిక పెట్టుబడి గనుక రూ.7.5 లక్షలు దాటితే.. ఆ పైన ఉన్న అదనపు మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రూ.75,000ల స్టాండర్డ్ డిడక్షన్ బోనస్

కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే సాలరీడ్ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్‌డేట్ ఇచ్చింది. గతంలో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచుతూ.. ప్రస్తుతం ఎటువంటి బిల్లులు లేదా ఖర్చుల ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండానే నేరుగా రూ.75,000 ల స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి ఈ రూ.75 వేలు నేరుగా మైనస్ అవుతాయి.

హోమ్ లోన్ వడ్డీ, ఆఫీస్ అలవెన్సులు

మీరు ఏదైనా ఇంటిని కొనుగోలు చేసి, దానిని అద్దెకు ఇచ్చినట్లయితే.. ఆ ఇల్లు లేదా ఫ్లాట్ కోసం తీసుకున్న హోమ్ లోన్ వడ్డీపై కొత్త పన్ను విధానంలో కూడా మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ మినహాయింపును కేవలం హౌస్ ప్రాపర్టీ ద్వారా వచ్చే ఆదాయానికి మాత్రమే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు ఆఫీస్ పని కోసం మీరు వాడే మొబైల్, ఇంటర్నెట్ బిల్లుల రీఇంబర్స్‌మెంట్, కంపెనీ ఇచ్చే హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్స్, అఫీషియల్ టూర్స్, ట్రాన్స్‌ఫర్ ఖర్చులు, ఉచిత భోజన వోచర్లపై కూడా నిబంధనల ప్రకారం ఎలాంటి పన్ను విధించబడదు.

గిఫ్ట్‌లు మరియు ఫ్యామిలీ పెన్షన్ పొందే వారికి ఊరట

ఆర్థిక సంవత్సరం 2025-26 నియమాల ప్రకారం.. ఒక ఉద్యోగికి తన కంపెనీ లేదా యాజమాన్యం నుండి లభించే రూ.5,000 విలువైన బహుమతులపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. అలాగే వివాహాలు, వారసత్వం ద్వారా వచ్చే బహుమతులకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందుతుంటే.. కొత్త పన్ను విధానంలో వారికి పెన్షన్ మొత్తంలో మూడో వంతు (1/3rd) లేదా గరిష్టంగా రూ.25,000ల వరకు ఏది తక్కువైతే ఆ మొత్తానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి సరైన ప్లానింగ్‌తో కొత్త విధానంలోనూ మీ పన్నును భారీగా ఆదా చేసుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story