New Tax Regime Rules : ఒకప్పుడు పన్ను ఆదా చేయడంతో పాటు మంచి లాభాలను ఆర్జించడానికి మధ్యతరగతి ఉద్యోగులకు, ఇన్వెస్టర్లకు మొదటి ఛాయిస్‌గా ఉన్న ఈఎల్ఎస్ఎస్ (Equity Linked Savings Scheme) ఫండ్స్ ఇప్పుడు తమ పాపులారిటీని కోల్పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం వైపు ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు మొగ్గు చూపుతుండటమే దీనికి ప్రధాన కారణం. కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఈ టాక్స్-సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ డిమాండ్ మార్కెట్లో గణనీయంగా పడిపోయిందని ఆర్థిక మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సెక్షన్ 80C మినహాయింపులు లేకపోవడమే మైనస్

ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించేది. అంతేకాకుండా కేవలం మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ మాత్రమే ఉండటంతో పిపిఎఫ్, ఎన్ఎస్‌సి వంటి ఇతర సాంప్రదాయ పొదుపు పథకాల కంటే దీనికే క్రేజ్ ఎక్కువగా ఉండేది. అయితే, ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చి, అందులో ఎలాంటి సెక్షన్ 80C మినహాయింపులు వర్తించవని స్పష్టం చేయడంతో, ఈ ఫండ్స్ వైపు చూసే వారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది.

ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల వైపు ఇన్వెస్టర్ల మొగ్గు

గడిచిన కొద్ది కాలంగా ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తక్కువ పన్ను రేట్లతో, మరింత సులభంగా మార్చడంతో మెజారిటీ ప్రజలు దీనినే ఎంచుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ డేటా ప్రకారం, ఇటీవల ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ నుంచి బయటకు వెళ్లడం లేదు. కేవలం టాక్స్ సేవింగ్ ఫండ్స్ స్థానంలో ఎలాంటి ఆంక్షలు లేని ఫ్లెక్సీ-క్యాప్, మల్టీ-క్యాప్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‎లలో పెట్టుబడులు పెడుతున్నారు.

లాక్-ఇన్ పీరియడ్ లేని స్వేచ్ఛే ముఖ్యం

ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే కనీసం మూడేళ్ల వరకు ఆ డబ్బును తిరిగి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుండదు. కానీ సాధారణ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అలాంటి లాక్-ఇన్ పీరియడ్ నిబంధనలు ఏవీ ఉండవు. ఇన్వెస్టర్లు తమకు డబ్బు అవసరమైనప్పుడు లేదా మార్కెట్ గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా తమ యూనిట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానాన్ని ఫాలో అవుతున్న వారు ఈ రకమైన పెట్టుబడి స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అందుకే లాక్-ఇన్ పీరియడ్ ఉండే ఈఎల్ఎస్ఎస్ కంటే స్వేచ్ఛగా విత్‌డ్రా చేసుకునే ఫండ్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ భవిష్యత్తు ఏంటి?

అయితే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ప్రాధాన్యత మార్కెట్లో పూర్తిగా ముగిసిపోలేదని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటికీ పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తున్న ఉద్యోగులకు టాక్స్ తగ్గించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గంగానే ఉంది. భవిష్యత్తులో ఈ కేటగిరీ ఫండ్స్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కేవలం టాక్స్ బెనిఫిట్స్ చూపిస్తే సరిపోదని, ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా మిగతా ఫండ్స్ కంటే మెరుగైన రిటర్న్స్ అందించి తమ పనితీరును నిరూపించుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story